2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన క్రమంలో ఇవాళ ఆర్థిక సర్వేను లోక్సభలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను మంగళవారం రోజున సమర్పించనున్న క్రమంలో ఆర్థిక సర్వేను సభ ముందుంచారు. ఆర్థిక సర్వేతో పాటుగా గణాంక అనుబంధాన్ని సైతం సభలో ప్రవేశపెట్టారు.
బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఒక రోజు ముందుగా ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ పని తీరు, రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసి చెప్పేదే ఈ ఆర్థిక సర్వే. ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల విభాగంలోని ఎకనమిక్ డివిజన్ ఈ సర్వేను తయారు చేస్తుంది. మొట్టమొదటి ఆర్థిక సర్వేను 1950-51 సంవత్సరం నుంచి బడ్జెట్తో పాటు ప్రవేశపట్టారు.
ఆర్థిక సర్వే-2024లోని ముఖ్యాంశాలు..
- 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 7 శాతంగా ఉంటుందని అంచనా.
- అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు, వాటి ప్రభావం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి.
- ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు కొనసాగినప్పటికీ కీలక రంగాలు ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచాయి. రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధితో దూసుకెళ్లనుంది.
- ఈ ఏడాది దేశ వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
- కార్పొరేట్, బ్యాంకింగ్ సంస్థల బ్యాలెన్స్ షీట్లు బలంగా ఉన్న క్రమంలో ప్రైవేట్ పెట్టుబడులు పెరిగేందుకు ఇది ఉపయోగపడుతుంది.
- భారత వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోన్న క్యాపిటల్ మార్కెట్ రానున్న భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితులను సైతం తట్టుకుని నిలబడగలదని అంచనా.
- దేశంలో తగ్గిన నిరుద్యోగ రేటు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గింది.
- ఆటోమొబైల్ రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎల్ఐ స్కీమ్ ద్వారా రూ.68 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో రూ.14 వేల కోట్లు ఇప్పటికే కార్యరూపం దాల్చాయి.