అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ పథకంపై యువతను తప్పు దోవ పట్టించే విధంగా ఆ యా పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. జులై 26వ తేదీ కార్గిల్ దివాస్. ఈ సందర్భంగా అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాల విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
సైన్యంలో సంస్కరణల కోసం ఈ పథకాన్ని తీసుకు వచ్చినట్లు తెలిపారు. సైన్యంలోకి యువ రక్తాన్ని తీసుకు రావడంతోపాటు యుద్దానికి ఎల్లవేళలా సన్నద్ధంగా ఉండే విధంగా యువతను తయారు చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
అగ్నిపథ్ సున్నితమైన అంశమని చెప్పారు. అలాంటి అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు.. తమ వ్యక్తిగత లాభం కోసం అగ్నిపథ్ పథకాన్ని రాజకీయ అంశంగా మలుచుకున్నాయని ప్రధాని ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలు చేస్తున్న ఆ యా పార్టీల్లోని వ్యక్తులు.. గతంలో సైన్యంలో వేల కోట్ల రూపాయిల కుంభకోణాలకు పాల్పడి సైన్యాన్ని బలహీన పరిచాయని ప్రధాని మోదీ వివరించారు.
ఈ ఏడాది జులై 26వ తేదీతో కార్గిల్ యుద్దం ముగిసి 25 ఏళ్లు అయింది. ఈ యుద్ధంలో మృతి చెందిన జవాన్లు కోసం ద్రాస్ సెక్టర్లోని నిర్మించిన కార్గిల్ స్మారక స్థూపం వద్ద ప్రధాని మోదీ వారికి ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధం దాదాపు మూడు నెలల పాటి సాగి జులై 26వ తేదీతో ముగిసింది.
ఈ సందర్భంగా పొరుగునున్న దాయాది దేశం పాక్పై మండిపడ్డారు. పాకిస్తాన్ నేటికి గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు. పాకిస్థాన్ నేరాలకు పాల్పడి గతంలో విఫలం అయ్యిందని, కానీ ఆ చరిత్ర నుంచి ఆ దేశం ఏమీ నేర్చుకోలేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఉగ్రవాదం, ప్రచ్ఛన్న యుద్ధంతోనే ఆ దేశం జీవనం చేస్తోందని విమర్శించారు. తాను మాట్లాడే ప్రదేశం నుంచి ఉగ్రదాడులకు పాల్పడుతున్న ముఠా నేతలు తన స్వరాన్ని నేరుగా వింటారని, ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న దేశాలకు ఓ విషయాన్ని చెప్పదలుచుకున్నానని, ఆ దేశ కుంచిత ఆలోచనలు ఎన్నటికీ విజయవంతం కావు అని ప్రధాని తెలిపారు.
ప్రధాని మోదీ రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం యువతను సైన్యంలోకి తీసుకొనేందుకు అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.