పశ్చిమబెంగాల్, కేరళలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్లు పెండింగ్లో ఉంచడంపై ఆయా రాష్ర్టాల్లోని టీఎంసీ, ఎల్డీఎఫ్ ప్రభుత్వాలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం పరిగణనలోకి తీసుకొన్నది.
మూడు వారాల్లోగా పిటిషన్లపై స్పందన తెలియజేయాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, పశ్చిమబెంగాల్, కేరళ గవర్నర్ల కార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. పిటిషన్లో కేంద్ర హోంశాఖను కూడా ప్రతివాదిగా చేర్చాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కొన్ని బిల్లులను రాష్ట్రపతి ముర్ముకు కూడా సిఫారసు చేశారని, అవి కూడా ఇంకా ఆమోదం పొందలేదని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పేర్కొన్నది. ఏడు బిల్లుల్లో ఒక్కదానికి కూడా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలతో సంబంధం లేదని తెలిపింది. ఈ బిల్లులను గవర్నర్ రెండేండ్లుగా పెండింగ్లో ఉంచారని, ఇలాంటి చర్యలు రాష్ట్ర శాసనసభ కార్యకలాపాలను దెబ్బతీస్తాయని, అసమర్థంగా మారుస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇందులో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులు కూడా ఉన్నాయని తెలిపింది. ఎల్డీఎఫ్ సర్కార్ సుప్రీంకోర్టులో మార్చిలో పిటిషన్ వేసింది. కేరళ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ ‘ఇది చాలా దురదృష్టకర పరిస్థితి’ అని పేర్కొన్నారు.
గవర్నర్ చాలా కాలంగా బిల్లులను పెండింగ్లో ఉంచారని, బిల్లును ఆమోదించకుండా నిలుపుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఏ పరిస్థితిలో తిప్పి పంపాలి? లేదా రాష్ట్రపతికి సిఫారసు చేయాలి? అనే దానిపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరారు.
తమ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఎనిమిది బిల్లులకు ఆమోదం తెలపకుండా నిలిపివేశారని టీఎంసీ సర్కార్ కోర్టుకు తెలిపింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వి తమిళనాడు వంటి రాష్ర్టాల్లో జరిగిన పలు పరిణామాలను వివరించారు.
సుప్రీంకోర్టు కేసులను విచారణకు తీసుకోగానే.. కొన్ని బిల్లులను ఆమోదించడమో లేదా రాష్ట్రపతికి సిఫారసు చేయడమో జరిగిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఎలాంటి కారణం చెప్పకుండా నిలుపుదల చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 200కు విరుద్ధమని పేర్కొన్నారు.