తన ట్విట్టర్ ఖాతాదారులు తగ్గిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గత నెలలో రాసిన లేఖకు సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ఘాటుగా స్పందించింది. ఆ సంఖ్య అర్ధవంతమైనవి, ఖచ్చితమైనవని స్పష్టం చేసింది. మానిప్యులేషన్, స్పామ్‌లను ఏ మాత్రం సహించబోదని ట్విట్టర్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
తాము స్పామ్, హానికరమైన ఆటోమేషన్తో వ్యూహాత్మకంగా, లెర్నింగ్ టూల్స్‌తో పోరాడతామని, ఆరోగ్యకరమైన, విశ్వసనీయ ఖాతాలను నిర్ధారించడానికి తాము చేపడుతున్న చర్యల కారణంగా ఫాలోవర్ల సంఖ్య హెచ్చు తగ్గులుగా ఉండవచ్చునని తెలిపారు. భారత్‌లో స్వేచ్ఛ, న్యాయమైన భావ ప్రకటనను అరికట్టడంతో ట్విట్టర్ బహుశా తెలియకుండానే భాగస్వామ్యమైందని చెప్పారు.
గత నెల 27న సంస్థ సిఇఒ పరాగ్ అగర్వాల్‌కు రాహుల్ వ్రాసిన లేఖలో ఆగస్టు 2021లో తన ఖాతా తాత్కాలికంగా సస్పెండ్ అయిన తర్వాత.. తన ఫాలోవర్ల సంఖ్య పెరగలేదని ఫిర్యాదు చేశారు. భారత్ ఆలోచనల్ని నాశనం చేయడంలో పావుగా మారకూడదంటూ మండిపడ్డారు.
భారత దేశంలో నిరంకుశత్వం పెరగడానికి సహాయపడకుండా చూసుకోవడం చాలా పెద్ద బాధ్యత అని హితవు చెప్పారు. ఇది భారత సంస్థాగత వ్యవస్థపై కొనసాగుతున్న దాడి, మీడియాను పూర్తిగా స్వాధీనం చేసుకోవడమేనని రాహుల్ విమర్శించారు.
‘ఇటీవల ప్రజల సమస్యలను లేవనెత్తడానికి ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాను వేదికగా వినియోగిస్తున్నాం. ఈ నేపథ్యంలో నా ట్విట్ట్ ఫాలోవర్లు ఒక్కసారిగా తగ్గిపోవడం ఆందోళన కల్గిస్తోంది. దాదాపు 20 మిలియన్ల ఫాలోవర్లతో, నా ఖాతా యాక్టివ్‌గా ఉంది. ప్రతి రోజు సగటున ఎనిమిది నుండి 10 వేల మంది నన్ను ఫాలో అయ్యేవారు’. అని తెలిపారు.
`ఉదాహరణకు గత ఏడాది మేలో సుమారు 6.40లక్షల మంది ఫాలోవర్లు వచ్చారు. జులైలో కూడా ఇదే పరిస్థితి. కానీ 2021 ఆగస్టులో తన ఖాతా నెలవారీ ట్విట్టర్ల ఫాలోవర్ల సున్నాకు పడిపోయింది. దీనిని బట్టి అర్థమౌతుందీ ఏంటంటే.. తన ఖాతా పక్షపాతానికి గురైనట్లు కనిపిస్తుంది’ అని లేఖలో రాహుల్ ఆరోపించారు.
కాగా, సోషల్ మీడియా నిపుణుల విశ్లేషణలను ఈ లేఖకు జత చేశారు. ఇందులో తాను ఢిల్లీలో అత్యాచార బాధితురాలి దుస్థితిపై లేవనెత్తానని, రైతులకు సంఘీభావంగా నిలిచానని, ఇతర మానవ హక్కుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడానని పేర్కొన్నారు. అయితే ఈ విధంగా గళమెత్తిన తనపై.. ప్రభుత్వ ఒత్తిడితో ఇటువంటి దుస్సాహసానికి ఒడిగట్టారని తెలుస్తోందని పేర్కొన్నారు.
చట్టబద్ధమైన కారణం లేకుండా తన ఖాతాను కొన్ని రోజుల పాటు బ్లాక్ చేశారని తెలిపారు. తాను వినియోగించిన ఫోటోలను ట్వీట్ చేసిన కొన్ని ఇతర ఖాతాలు కొనసాగాయని, అవి బ్లాక్ కాబడలేదని మండిపడ్డారు. ఈ లేఖకు స్పందనగా.. ట్విట్టర్.. కంపెనీ విధానాన్ని ఉల్లంఘించినందుకు ప్రతి వారం మిలియన్ల ఖాతాలను తీసివేసినట్లు పేర్కొంది.