పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను బాకర్ చరిత్ర సృష్టించింది. విశ్వ వేదికపై తొలి పతకం అందించి యావత్ భారతావనిని సంబురాల్లో ముంచెత్తింది. ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టర్ ఫైనల్లో బాకర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం కొల్లగొట్టింది.
దాంతో, షూటింగ్ విభాగంలో తొలి మెడల్ గెలుపొందిన మొదటి మహిళా షూటర్‌గా బాకర్ రికార్డు నెలకొల్పింది. ఒలింపిక్స్ ప్రారంభమైన మూడో రోజు ఎట్టకేలకు భారత్ విశ్వ క్రీడల్లో పతకాల ఖాతా తెరిచింది. క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో 580-27x స్కోరుతో అదరగొట్టిన భాకర్ మూడో స్థానంలో నిలిచి పతకంపై ఆశలు రేపింది.
అనుకున్నట్టుగానే కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షను నిజం చేసింది. ఫైనల్లోనూ చెక్కు చెదరని గురితో 221.7 పాయింట్లు సాధించింది. దాంతో, ఒలింపిక్స్‌లో తొలి మెడల్ గెలిచిన మహిళా షూటర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా స్వర్ణంతో మెరిసిన విసయం తెలిసిందే.
221.7 పాయింట్లతో మను భాకర్ మూడవ స్థానంలో నిలిచింది. దక్షిణకొరియాకు చెందిన వైజే ఓహ్ 243.2 పాయింట్లతో స్వర్ణం గెలుచుకుంది. అదే దేశానికి చెందిన వైజే కిమ్ 241.3 పాయింట్లతో రజతం గెలుచుకుంది. టైటిల్ పోరులో మను భకర్ అద్భుత ప్రదర్శన కనబరిచి సరికొత్త చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్‌లో షూటింగ్ కేటగిరిలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచింది.
ఇప్పటివరకు ఒలింపిక్ మహిళల షూటింగ్ విభాగంలో భారత్‌కు లభించిన తొలి పతకం ఇదేకావడంతో మనుభాకర్‌కు అభినందనలు వ్యక్తమవుతున్నాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం అభినందనలు తెలిపారు. మను భాకర్‌ను చూసి భారతదేశం గర్విస్తోందని.. ఆమె ఫీట్ చాలా మంది క్రీడాకారులకు.. ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. ఆమె భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
మను భకర్ పతకం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మను భకర్ సాధించిన కాంస్యం చారిత్రాత్మకమైన పతకమని అభివర్ణించారు. పారిస్ ఒలింపిక్స్‌లో తొలి పతకం అందించావు.. వెల్ డన్ మను భకర్ అంటూ అభినందించారు. కాంస్యం గెలిచినందుకు కంగ్రాచ్యులేషన్స్.. ఈ పతకం ఎంతో ప్రత్యేకమన్నారు. ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్‌కు షూటింగ్ కేటగిరిలో పతకం అందించిన తొలి మహిళగా మను భకర్ అవతరించిగా.. నిజంగా ఇది అద్భుతమైన ఘనత అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.