అసెంబ్లీ సమావేశాల సమయంలో ఓబీసీ రిజర్వేషన్‌పై గందరగోళం సృష్టించినందుకు వేటుపడిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు రద్దు చేయడం చరిత్రాత్మకం అంటూ బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్యెల్యేలను సస్పెండ్ చేయడం రాజ్యాంగవ్యతిరేకమని, అది చెల్లదని సుప్రీంకోర్ట్ తీర్పు ఇవ్వడం పట్ల బిజెపి నేతలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ఈ నిర్ణయాన్ని తిరస్కరించాలని కోర్టు ఇచ్చిన తీర్పు సత్య విజయం అని పేర్కొంటూ మహారాష్ట్ర మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ తన గళాన్ని పెంచుతూనే ఉంటుందని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా స్పష్టం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించే ఒక చారిత్రాత్మక నిర్ణయమని ఆయన ట్వీట్ చేశారు. అంతేగాకుండా పక్షపాతం లేకుండా తీర్పునిచ్చినందుకు సుప్రీంకోర్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సస్పెన్షన్ రద్దయినందుకు 12 బీజేపీ ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు.
గత ఏడాది జులైలో మిగిలిన సమావేశాల కాలానికి మించి మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి 12 మంది బిజెపి సభ్యులను సస్పెండ్ చేస్తూ ఆమోదించిన తీర్మానాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తప్పుపట్టింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఇందులో హేతుబద్ధత లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
అసెంబ్లీ స్పీకర్ పట్ల అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణపై మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి తమను ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ 12 మంది బిజెపి ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.
మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఒక ఎమ్మెల్యేను 60 రోజులకంటే ఎక్కువ సస్పెండ్ చేయడమంటే, ఒక విధంగా ఎమ్మెల్యే పదవి రద్దు చేయడంతో సమానమని కోర్టు పేర్కొంది.
ఎలాంటి నియోజకవర్గమైనా ఆరు నెలలకంటే ఎక్కువ కాలం ప్రజాప్రతినిధి లేకుండా ఉండరాదు. దీంతో సంవత్సర కాలంపాటు సస్పెండ్ వేటు వేయడం తప్పని పేర్కొంటూ 12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ వేటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అధికార బలంతో విపక్షాలను అణచివేయాలని ప్రయత్నించిన ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపెట్టని విపక్షాలు వ్యాఖ్యానించాయి.
ఈ తీర్మానాన్ని చట్టవ్యతిరేకమైనదిగా పరిగణిస్తూ కొట్టివేస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ సిటి రవికుమార్ ఉన్నారు.
భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ప్రజల హక్కుల కోసం బీజేపీ ఎప్పుడూ పోరాడుతుందని నడ్డా చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్‌తో దురుసుగా ప్రవర్తించారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించడంతో గత ఏడాది జూలై 5న వారిని ఏడాదిపాటు సస్పెండ్ చేశారు.
అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై శివసేన ఎంపీ సంజయ్ రావుత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు విధాన్ సభ అధికారాలను ఆక్రమించుకుందని, పాలనా వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం సరికాదని స్పష్టం చేశారు. గతంలో రాజ్యసభలో మా పార్టీకి చెందిన కొందరు ఎంపీలు సస్పెండ్‌కు గురయ్యారు. ఆ సమయంలో సుప్రీం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.