వయనాడ్ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్ స్వయంగా ముందుకొచ్చారు. శనివారం ఆయన టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్ విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశం అయ్యారు.
బాధితులకు పునరావాసం కల్పించడం కోసం రూ.3 కోట్లను విరాళం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మోహన్‌లాల్ వయనాడ్ పర్యటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.
కాగా,కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వయనాడు బాధితుల కోసం రూ.1 లక్ష విరాళం ప్రకటించారు. ఆయన భార్య టి.కె. కమల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.33,000 అందించారు. మరోవైపు కేరళ సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు కూడా తమ నెల జీతం రూ.50,000లను ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నామని తెలిపారు.
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఎంతోమంది మృతిచెందడం యావత్ దేశాన్ని కలచివేస్తోంది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకువస్తున్నారు. ఇప్పటికే పలువురు నటులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళాలు ఇచ్చారు.
తాజాగా కమల్‌హాసన్ రూ.25లక్షలు విరాళం అందించారు. మరోవైపు ఆచూకీ గల్లంతైనవారిని గుర్తించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకుపోయారో తెలుసుకునేందుకు డ్రోన్లు, రాడార్లు, మొబైల్ ఫోన్ల సిగ్నళ్ల ద్వారా ముమ్మర ప్రయత్నం కొనసాగుతోంది. ఇంకా వందలమంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది.
రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. సహాయక బృందాన్ని కొనియాడారు.
‘‘వయనాడ్‌లో నెలకొన్న బీభత్సంలో అటవీ అధికారులు, రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రెస్క్యూ బృందం 8 గంటలపాటు శ్రమించి, ప్రాణాలకు తెగించి ఓ మారుమూల గిరిజన కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలను కాపాడింది. ఈ విషాద సమయంలో సహాయక బృందాలు అందిస్తున్న తోడ్పాటు వారిలోని గొప్పతనాన్ని తెలియజేస్తోంది. మనం ఇలా ఐక్యంగా ఉంటూ ధైర్యంగా కష్టాలను ఎదుర్కొందాం.. పునర్నిర్మించుకుందాం’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.