ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి (84) ఇక లేరు. ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని అపోలో ఆసుప్రతిలో కన్నుమూశారు. యామినీ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లె. ఆమె ప్రముఖ భారతీయ నర్తకిగా ఖ్యాతిని పొందారు.
భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాల్లో నిష్ణాతురాలు. కర్ణాటక సంగీతం సైతం నేర్చుకొని పాటలు పాడుతూ నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. మదనపల్లిలో 1940వ సంవత్సరం డిసెంబరు 20న జన్మించింది. ఆమె తండ్రి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు. తాత ఉర్దూ కవి. ఆమె కుటుంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడింది.
భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన యామిని 1957లో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చింది. అప్పటి నుంచి దేశ, విదేశాల్లో వేలాదిగా ప్రదర్శనలిచ్చారు. యామినీ కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా పని చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో నృత్య కేంద్రం స్థాపించి పలువురికి శిక్షణ ఇచ్చారు. ఆమెకు భారతీయ కళారంగానికి చేసిన సేవకు కేంద్రం తొలిసారిగా 1968లో పద్మశ్రీతో సత్కరించింది. 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలను అందింది. అలాగే, 1977లో సంగీత నాటక అకాడమీ అవార్డును సైతం అందుకున్నారు.
పదేళ్లు వచ్చేసరికి నా ట్యంలో ఆమె నైపుణ్యం సాధించారు. తండ్రి ఆమెను మొదట చెన్నైలోని రుక్మిణీ అరండేళ్ కళాక్షేత్రంలో నాట్యశిక్షణ ఇప్పించారు. ప్రాథమిక నైపుణ్యాల ను నేర్చుకున్న తరువాత ప్రసిద్ధ ఎల్లప్ప పిళ్లై, తంజావూరు కిట్టప్ప పిళ్లై వద్ద నృత్యంలో మరింత శిక్షణ పొందడానికి కాంచీపురం వెళ్లారు. కూచిపూడి నాట్యం కూడా నేర్చుకున్నారు. తరువాత ప్రముఖ ఒడిస్సీ నాట్యాచార్యులు కే లూచరణ్ మహాపాత్ర దగ్గర ఒడిస్సీ నృత్యంలో శిక్షణ పొందారు.