ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్డీయే కూటమి పక్షాలైన లోక్ జనశక్తి పార్టీ(రాంవిలాస్), రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ-అథవాలే) తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని లోక్ జనశక్తి పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు.
అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత రామ్‌దాస్ అథవాలే కూడా తీర్పును వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీలేయర్ క్రిటేరియాపై అప్పీలు చేస్తామని స్పష్టం చేశారు. ‘‘15ు ఎస్సీ కోటాలో వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్షించాలని కోరుతున్నాం. దీనిపై అప్పీల్‌కు వెళ్తాం’’ అని చిరాగ్ పాశ్వాన్ చెప్పారు.
అస్పృశ్యత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు విఫలమైందని వ్యాఖ్యానించారు. ‘‘ఎస్సీ కోటాలో క్రీమీలేయర్‌ను ఎట్టిపరిస్థితిలోనూ అనుమతించలేం. వర్గీకరణ ద్వారా ఎస్సీలు అనుభవిస్తున్న అస్పృశ్యత పరిష్కారం కాదు’’ అని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు, ఎస్సీల్లోని ఉన్నత విద్యావంతులు, ఆర్థికంగా బలంగా ఉన్నవారు కూడా అస్పృశ్యతను ఎదుర్కొంటున్నారని పాశ్వాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో వర్గీకరణ మరింత అన్యాయానికి గురిచేసినట్టే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవంక, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరుతున్న కుల గణనకు పాశ్వాన్ మద్దతు తెలిపారు. అయితే, ఆయా కులగణన వివరాలను మాత్రం బహిరంగ పరచకూడదని అభిప్రాయపడ్డారు. కాగా, తమ మిత్రపక్షం జేడీయూ సుప్రీంకోర్టు తీర్పును సమర్థించడంపై మాత్రం పాశ్వాన్ మౌనం వహించారు.
మరోవైపు, ఆర్పీఐ అధినేత, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే కూడా సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కులం ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఏర్పాటు చేశారని, దీనిలో క్రీమీలేయర్ క్రిటేరియా వర్తింపచేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని, దీనిపై అప్పీలుకు వెళ్తామని వెల్లడించారు.
“అంటరానితనం వల్ల బాధితులుగా మిగిలిన అణగారిన వర్గాలను పైకి తీసుకువచ్చేందుకు ఎస్సీ కోటాను ప్రవేశపెట్టారు. ఉప వర్గీకరణ వల్ల అసలు ప్రయోజనం నెరవేరకుండా పోతుంది. అంటరానితనం అనే పదాన్ని కోర్టు తీర్పులో ఎక్కడా ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. చదువుకునే అవకాశం అందుబాటులో ఉన్న సంపన్నవంతులైన దళితులు సహా, ఎస్సీల్లో అత్యధికులు అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నారు. ఉపవర్గీకరణను అనుమతించడం న్యాయసమ్మతం కాదు” అని చిరాగ్ పాసవాన్ తెలిపారు.
దళితులకు క్రిమీలేయర్ నిబంధనను వర్తింపజేసేలా ఎలాంటి ప్రయత్నం జరిగినా, దానిని అడ్డుకుంటామని కేంద్రమంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాందాస్ అఠావలె స్పష్టం చేశారు. ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణ వల్ల వారిలో అత్యంత వెనుకబడి ఉన్నవారికి న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఇతర కేటగిరీలవారికీ ఇలాంటిది జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
20 ఏళ్లుగా నలుగుతున్న షెడ్యుల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి సుప్రీం కోర్ట్ ఇటీవలే కీలకమైన తీర్పు ఇచ్చింది. సామాజిక స్థితిగతుల ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్ల కోటాలో ఎవరి వాటా ఎంతో నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని స్పష్టం చేసింది. సీజేఐ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజార్టీతో ఈ విస్పష్టమైన తీర్పు వెలువరించింది.
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించవచ్చని తేల్చి చెప్పింది. ఉపవర్గీకరణకు సంబంధించి 2004లో సుప్రీంకోర్టు ‘ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్’ కేసులో ఇచ్చిన తీర్పు చెల్లదని పేర్కొంది. అయితే, ఉపవర్గీకరణ చేపట్టే రాష్ట్రాలు- అందుకు సహేతుక కారణాలు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.