దేశవ్యాప్తంగా జరుగుతున్న తీవ్ర ఆందోళనల నేపథ్యంలో.. ఇవాళ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. తన పదవికి రాజీనామా చేసి.. దేశం విడిచి వెళ్లారు. అయితే ఆమె ఎక్కడికి వెళ్లారన్న దానిపై పూర్తి క్లారిటీలేదు. ప్రత్యేక మిలిటరీ విమానంలో షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహానా.. ఇండియాకు పయనమైనట్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి.
. బంగభబన్ నుంచి ఆమె మధ్యాహ్నం 2.30 నిమిషాలకు బయలుదేరి వెళ్లారు. షేక్ హసీనా, షేక్ రెహానా.. చాలా సురక్షితమైన ప్రాంతానికి చేరుకున్నట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. అధ్యక్ష భవనం విడిచి వెళ్లడానికి ముందు.. షేక్ హసీనా స్పీచ్‌ను రికార్డు చేయాలనుకున్నారు.
కానీ సమయం లేకపోవడంతో ఆమె తొందరగా అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. 1971 యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు 30 శాతం కోటాను కేటాయిస్తూ షేక్ హసీనా సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన హింసలో సుమారు వంద మంది మరణించారు.
ప్రస్తుతం బంగ్లాలో కర్ఫూ కొనసాగుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు సైన్యం సిద్ధమైంది. లా అండ్ ఆర్డర్ మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆర్మీ చీఫ్ ప్రకటించారు. మరోవైపు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సైన్యం మొహరించింది.
ఆదివారం మొదలైన ఈ అల్లర్లు సోమవారం రెండో రోజు కూడా కొనసాగాయి. ఇవాళ వేలాది మంది నిరసనకారులు రాజధాని ఢాకాలో విధ్వంసం సృష్టించారు. జాతిపిత షేక్ ముజిబుర్ విగ్రహాన్ని ధ్వసం చేశారు. ఇక ఢాకాలోని పీఎం అధికారిక నివాసం గణభబన్‌ను ముట్టడించారు. కొందరు నిరసనకారులు పీఎం నివాసంలోకి చొచ్చుకెళ్లారు. దీంతో బంగ్లా ప్రధాని షేక్ హసీనా, ఆమె సోదరి షేక్ రెహానా బంగ్లాను వీడి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ అల్లర్లలో ఇప్పటి వరకూ 300 మందికిపైగా మృతి చెందినట్లు స్థానిక మీడియా నివేదించింది.
బంగ్లాదేశ్‌లో పరిస్థితి అదుపుతప్పింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆందోళనకారులు ఆయుధాలను చేతపట్టి వాహనాలు, దుకాణాలు, కార్యాలయాలను ధ్వంసం, దగ్ధం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లపై అధికార పార్టీ నేతల నివాసాలు, కార్యాలయాలపై కూడా దాడులకు తెగబడుతున్నారు.