భారతదేశంలోని ప్రస్తుత మానవ హక్కుల పరిస్థితిపై మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మరో నలుగురు అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన ఒక రోజు తర్వాత, విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతదేశం బలమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యమని, ఇతరుల నుండి సర్టిఫికేట్ అవసరం లేదని అంటూ తీవ్రంగా తిప్పికోట్టింది.
పైగా, ఈవెంట్ నిర్వాహకుల ట్రాక్ రికార్డ్ “పాల్గొనేవారి పక్షపాతాలు, రాజకీయ ప్రయోజనాలకు” ప్రసిద్ధి చెందిందని కొట్టిపారవేసింది. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ బుధవారం నిర్వహించిన వర్చువల్ ప్యానెల్ చర్చలో అన్సారీ, నలుగురు అమెరికా చట్టసభ సభ్యులు ఈ వ్యాఖ్యలు చేశారు.
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, “మేము ఈ సమస్యపై నివేదికలను చూశాము. భారతదేశం బలమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యం. దీనికి ఇతరుల నుండి ధృవీకరణ అవసరం లేదు. మన రాజ్యాంగాన్ని ఇతరులు రక్షించాల్సిన అవసరం ఉందనే వాదన అహంకారం, అసభ్యకరమైనది. ఈవెంట్ ఆర్గనైజర్ల ట్రాక్ రికార్డ్ కూడా పాల్గొనేవారి పక్షపాతాలు, రాజకీయ ఆసక్తుల వలె ప్రసిద్ధి చెందింది” అంటూ ఎద్దేవా చేశారు.
భారతదేశం నుండి ప్యానెల్ చర్చలో పాల్గొన్న అన్సారీ, పెరుగుతున్న హిందూ జాతీయవాద ధోరణిపై తన ఆందోళనను వ్యక్తం చేశారు.
“ఇటీవలి సంవత్సరాలలో, పౌర జాతీయవాదం బాగా స్థిరపడిన సూత్రాన్ని వివాదాస్పదం చేసే ధోరణులు, అభ్యాసాల ఆవిర్భావాన్ని మేము అనుభవించాము. సాంస్కృతిక జాతీయవాదం కొత్త, ఊహాజనిత అభ్యాసాన్ని అడ్డగించాము…ఇది పౌరులను వారి విశ్వాసం ఆధారంగా వేరు చేయాలని కోరుకుంటుంది. అసహనానికి, అన్యతను ప్రేరేపించడానికి, అశాంతి, అభద్రతను ప్రోత్సహిస్తుంది,” అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
“భారత ప్రభుత్వం మైనారిటీ విశ్వాసాల ఆచారాలను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగిస్తున్నందున, అది వివక్ష, హింసకు మూలాలను తీసుకునే వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో, మేము ఆన్లైన్ ద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేషపూరిత చర్యలను చూశాము. ధ్వంసమైన మసీదులు, తగలబడిన చర్చిలు, మత హింసతో సహా, ”అని డెమోక్రటిక్ సెనేటర్ ఎడ్ మార్కీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం నిర్వహించిన ఐఏఎంసీ గతంలో రోహింగ్యాల సంక్షేమం కోసం అంటూ భారీగా నిధులను వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమీషన్ ద్వారా భారత దేశాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టించాలనే లక్ష్యంతో లాబీయింగ్ కోసం ఈ నిధులను ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థకు పాకిస్థాన్ పరోక్ష మద్దతు ఉందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.
అన్సారీ వాఖ్యల పట్ల కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తీవ్రంగా స్పందిస్తూ, పాకిస్థాన్‌ను పరోక్షంగా ప్రస్తావించారు. శత్రుత్వం నిండిన సంస్థ మద్దతుగల అంతర్జాతీయ వేదికపై భారత దేశ పరువు, ప్రతిష్ఠలను మంటగలిపేందుకు హమీద్ అన్సారీ ప్రయత్నించారని మండిపడ్డారు. రాజ్యాంగ పదవిని నిర్వహించిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం, భారతీయులు, భారత దేశ జాతీయవాదం, ప్రజాస్వామ్యాలపై ప్రశ్నలను లేవనెత్తడం ఆందోళనకరమని విమర్శించారు.
బిహార్ పరిశ్రమల శాఖ మంత్రి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ పాట్నాలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ముస్లింలకు భారత దేశం కన్నా మెరుగైన దేశం మరొకటేదీ లేదని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ కన్నా ఉత్తమ నాయకుడు కానీ, హిందువుల కన్నా ఉత్తములైన స్నేహితులు కానీ ముస్లింలకు వేరొకరు లేరని చెప్పారు.భారత దేశ వ్యతిరేక ప్రచారానికి పెట్టింది పేరుగా ఉన్న ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు అన్సారీ అంగీకరించి ఉండవలసింది కాదని పేర్కొన్నారు.
మరోవైపు నెటిజన్లు కూడా అన్సారీపై మండిపడుతున్నారు. అజిత్ దత్తా అనే ట్విటరాటీ స్పందిస్తూ, భారత దేశ ఉపరాష్ట్రపతిగా వరుసగా రెండుసార్లు ఎంపిక చేయడం వెనుక కాంగ్రెస్‌కు ఎదురైన రాజకీయ నిర్బంధాలు ఏమిటని ప్రశ్నించారు. ఇతరులెవరూ లేకపోవడం వల్లే ఆయనకు ఈ పదవిని కట్టబెట్టారా? ఒకరైనా వ్యతిరేకత వ్యక్తం చేయలేదా? అని ప్రశ్నించారు.