దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటి మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బిఎ), నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటిస్తాయి. మొత్తం 13 విభాగాల్లో ర్యాంకుల జాబితాను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
ఐఐటి మద్రాస్ అగ్ర స్థానంలో నిలవడం వరుసగా ఇది ఆరోసారి. ఐఐటి మద్రాస్ తర్వాత, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి), బెంగళూరు, ఐఐటి బాంబే వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
ఇంజనీరింగ్ కేటగిరీలో ఐఐటి మద్రాస్ మొత్తం విభాగాల్లో అగ్రస్థానంలో నిలవగా, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే తరువాతి స్థానాల్లో నిలిచాయి. పరిశోధనా విభాగంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అత్యుత్తమ సంస్థగా నిలిచింది.
యూనివర్శిటీ విభాగంలో ఐఐఎస్సి బెంగళూరు మొదటి ర్యాంకు సాధించగా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు), జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ వరుసగా రెండు , మూడు స్థానాలను పొందాయి.
మేనేజ్మెంట్ విభాగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) అహ్మదాబాద్ అత్యుత్తమ ర్యాంకును సాధించగా, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజికోడ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బెస్ట్ లా ఇన్స్టిట్యూట్ విభాగంలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ మొదటి స్థానంలో నిలిచింది.
మెడికల్ విభాగంలో ఎయిమ్స్ ఢిల్లీ మొదటి ర్యాంకు పొందగా, డెంటల్ విభాగంలో చెన్నైలోని సవీత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ అత్యుత్తమ సంస్థగా నిలిచింది.
ఉత్తమ రాష్ట్ర ప్రభుత్వ యూనివర్శిటీగా అన్నా యూనివర్శిటీ, చెన్నై మొదటి స్థానంలో నిలవగా, కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీ, పూణెలోని సావిత్రీబాయి పూలె పూణె యూనివర్శిటీ తరువాతి ర్యాంకులు పొందాయి.
అత్యుత్తమ ఓపెన్ యూనివర్శిటీగా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) గుర్తింపు పొందగా, పూణెలోని సింయాసిస్ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్స్ బెస్ట్ స్కిల్స్ యూనివర్శిటీగా గుర్తింపు పొందింది.