న్యాయస్థానం నుండి విచారణను తప్పించుకోవడానికే మూడు రాజధానుల చట్టాన్ని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టు ధర్మాసనం ముందు పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన విచారణలో న్యాయస్థానం విచారణను ప్రభుత్వం అడ్డుకుంటోందని న్యాయవాది చేసిన వాదనలపై ఎజి శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు.
నిన్నటి విచారణలో పిటిషనర్ల తరఫు వాదనలు ముగియడంతో ప్రభుత్వ వాదనల కోసం విచారణను ఫిబ్రవరి 2 కు వాయిదా వేస్తూ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వం మూడు రాజధానుల చట్టం రద్దును సదుద్దేశంతో చేయలేదని, బహుళ రాజధానుల చట్టాన్ని మళ్లీ తీసుకొస్తామని బహిరంగంగానే చెబుతోందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు.
మూడు రాజధానుల చట్టాన్ని తెచ్చే శాసనాధికారం, మళ్లీ దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని బృహత్ ప్రణాళిక ప్రకారం నిర్దిష్ట కాలంలో పూర్తి చేసేలా ఆదేశించాలని కోరారు. తాము దాఖలు చేసిన పలు వ్యాజ్యాల్లో రాజధానిలో నిలిచిపోయిన పనులను కొనసాగించాలని, భూములిచ్చిన రైతులకు అభివఅద్ధి చేసిన ప్రాంతంలో ప్లాట్లు ఇచ్చేలా ఆదేశించాలని కోరినట్లు తెలిపారు.
అమరావతి అభివృద్ధికి గతంలో ఇచ్చిన ‘యథాతథ స్థితి’ ఉత్తర్వులు అడ్డంకి కాదంటూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను న్యాయస్థానం పొడిగించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది.
సిఆర్డిఎ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ (మూడు రాజధానుల) చట్టాలను ‘రద్దు’ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం (యాక్ట్ 11/2021) తీసుకొచ్చిన తర్వాత దాఖలైన వ్యాజ్యాల్లో మిగిలిన అభ్యర్థనలపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
అమరావతి ప్రాంత ప్రజలు, రైతులపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదించారు. రాజధాని వ్యాజ్యాలపై విచారణను ప్రభుత్వం అడ్డుకోవడం ఇది మొదటిసారి కాదని అన్నారు. రాజధాని కోసం ఇప్పటివరకు రూ.16,500 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేశారని, జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు ? అని ప్రశ్నించారు.
రాజకీయ ఎజెండాతో రాజధాని మార్పు నిర్ణయించడం సరికాదని పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు స్పష్టం చేశారు. నిర్దిష్ట సమయంలో అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు ఇస్తామని చెప్పిన ఆ సమయం దాటిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చునని పేర్కొన్నారు.
పూర్తి స్థాయిలో అధ్యయనం జరిగాకే రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారని చెబుతూ. ప్రజల కోణం నుంచి చూసినా అమరావతి ఆమోదయోగ్యమైందని తెలిపారు. మూడు రాజధానుల చట్టాన్ని చేసే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, దాన్ని రద్దు చేస్తూ మళ్లీ చట్టం చేసే అధికారం అసలే లేదని స్పష్టం చేశారు.
రాజధాని వ్యవహారం పార్లమెంట్ పరిధిలోనిదని.. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రాజధానిగా అమరావతికి ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. ఇప్పుడు మూడు రాజధానుల పేరిట ప్రాంతాల వారీగా ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతున్నారని ఆరోపించారు. అమరావతి నిర్ణయం కేంద్ర ప్రభుత్వ సమ్మతితో జరిగింది కాబట్టే అభివఅద్ధి కోసం రూ.1500 కోట్ల ఆర్థికసాయం చేసిందని గుర్తు చేశారు.