రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రాఖీ పండుగ, ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తన ఇంటివద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి, వాస్తవానికి పొంతనే లేదని ధ్వజమెత్తారు.
రూ.40 వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేయకుండ మోసం చేశారని, ఇవన్నీ అడుగుతుంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. . రుణమాఫీ పూర్తిగా చేస్తారా చేయరా చెప్పండి అని ప్రశ్నించారు. ఇటీవల చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నలబై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నారు ఇంతవరకు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దాల మేడల్లో కూర్చొని, అందరికీ రుణాలు మాఫీ చేశామని ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి ఘాటుగా విమర్శించారు. సోనియాగాంధీ పుట్టిన రోజునాటికి అన్ని మాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు మొక్కుబడిగా చేయడమంటే సోనియాగాంధీని మోసం చేసినట్లు కాదా? అని ప్రశ్నించారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తే అన్నదాతలు ఎందుకు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారో రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
కాగా, ముఖ్యమంత్రి పదవి కోసం చాలా మంది కలలు కంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పార్టీ అవినీతి పార్టీని తాము చేర్చుకోమని స్పష్టం చేశారు. కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టాలి .. కానీ ఇంతవరకు పెట్టలేదన్నారు. విలీనం అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారని పేర్కొంటూ అప్పట్లో కాంగ్రేస్ లో బీఆర్ఎస్ ని విలీనం చేస్తా అని మాట తప్పాడని గుర్తు చేశారు. కేటీఆర్ బతుకు ఎటుగాకుండా పోయిందని ఎద్దేవా చేశారు.