రాబోయే ఐదేళ్లలో 70 ఉపగ్రహాలను ప్రయోగించే యోచనలో ఉన్నామని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ డాక్టర్ ఎస్ సోమ్‌నాథ్ వెల్లడించారు. ఇందులో చంద్రయాన్-4, చంద్రయాన్-5 మిషన్స్ సైతం ఉన్నాయని తెలిపారు. వీటి డిజైన్ ఇప్పటికే సిద్ధమైందని.. కేంద్రం అనుమతి కోసం చేస్తున్నామని తెలిపారు.
చంద్రయాన్-4లో చంద్రుడి ఉపరితలంపై నుంచి రాళ్లు, మట్టి నమూనాలను తీసుకురానున్నట్లు తెలిపారు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మిషన్‌లో స్పేస్ డాకింగ్ ఓ భాగమని వివరించారు. మిషన్‌లో పలు దశల్లో రాకెట్ల పలు భాగాలను నింగిలోకి పంపి.. ఆ తర్వాత వాటిని స్పేస్‌లోనే జతచేస్తారు.
ఇండియన్ స్పేస్ అసోసియేషన్‌కు చెందిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా డాక్టర్ సోమనాథ్ మీడియాతో మాట్లాడారు. చంద్రయాన్-3 తర్వాత చంద్రుడిపైకి ఎన్నో మిషన్లు చేపట్టనున్నట్లు తెలిపారు. 2028లో చంద్రయాన్-4ని ప్రయోగించనున్నట్లు తెలిపారు.
ఐదేళ్లలో ఇస్రో ప్రయోగించనున్న 70 ఉపగ్రహాల్లో దిగువ కక్ష్యలో ఉంచే ఉపగ్రహాలు ఉన్నాయని చెప్పారు. నాలుగు ఉపగ్రహాలు ప్రాంతీయ నావిగేషన్ సిస్టమ్‌వి సైతం ఉంటాయని తెలిపారు. పది కంపెనీలు చిన్న శాటిలైట్ లాంచ్ వెహికల్స్ నిర్మాణంలో ఆసక్తిని కనబరిచాయని పేర్కొన్నారు.
ఇందులో కొన్ని సాంకేతికత బదిలీకి బిడ్డర్లుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. రెండేళ్ల వ్యవధిలో ఇస్రో సహాయంతో రెండు ఎస్ఎస్ఎల్వీలను అభివృద్ధి చేస్తారని, ఆపై చిన్న ఉపగ్రహాలను తక్కువ భూమి కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి రాకెట్‌ను రూపొందించే పనిలో నిమగ్నమవుతారని ఇస్రో చీఫ్ వివరించారు.