కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు/డ్రాయింగ్లు సంపూర్ణంగా అధ్యయనం చేసే అవకాశాన్ని అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులు తమకు ఇవ్వలేదని మాజీ ఈఎన్సీ, సెంట్రల్ డి జైన్ ఆర్గనైజేషన్(సీడీవో) ఎ.నరేందర్‌రెడ్డి వెల్లడించారు. హడావుడిగా డిజైన్లు/డ్రాయింగ్‌లపై సంతకాలు చేయాలని కేసీఆర్, హరీశ్‌రావు, రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఈఎన్సీ బి.హరిరాం తనపై ఒత్తిడి చేశారని ఆరోపించారు.
3 డీ అధ్యయనం తర్వాత డి జైన్లు/డ్రాయింగ్లు రూపొందించాల్సి ఉండగా… 2 డీ అధ్యయనం తర్వాతే వీటిని తయారు చేయాల్సిన పరిస్థితి ఒత్తిళ్ల కారణంగా నెలకొందని వెల్లడించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణలో భాగంగా గురువారం నరేందర్‌రెడ్డిని ప్రశ్నించారు. డిజైన్లు/డ్రాయింగ్‌లతో ముడిపడిన పలు అంశాలపై కమిషన్ ప్రశ్నలు సంధించింది. తమను తొందరపెట్టి, ఒత్తిళ్లకు గురి చేయడం ద్వారా ఆమోదించాల్సిన అనివార్యతను కల్పించారని నరేందర్‌రెడ్డి కమిషన్‌కు చెప్పారు.
‘‘కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల ప్రకారం సెంట్రల్ డి జైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో)కు అధిపతిగా ఈఎన్సీ ఉండాలి. ఈఎన్సీ(సీడీవో) కింద హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్, డిజైన్, డ్రాయింగ్లకు వేర్వేరుగా సీఈలు పనిచేయాలి. ఈ డిజైన్లను కేంద్ర జల సంఘానికి పంపించే ముందు డీపీఆర్‌లోని చెక్ లిస్ట్‌పై ఈఎన్సీ(సీడీవో) సంతకం చేయాలి. అయితే, కొన్నేళ్లుగా సీడీవో పరిధిలో హైడ్రాలజీ, ఇన్వెస్టిషన్లు లేవు” అని స్పష్టం చేశారు.
“వాటిని ఈఎన్సీ(జనరల్) కిందకు మార్చారు. ఈ కారణం వల్లే చెక్‌లి్‌స్టపై సంతకం చేయడానికి నిరాకరిస్తూ 4-5 రోజుల పాటు డీపీఆర్ చెక్‌లి్‌స్టపై సంతకాలు చేయలేదు’’ అని నరేందర్‌రెడ్డి వివరించారు. డిజైన్లన్నీ సిద్ధమయ్యాక సంతకాలు ఎందుకు పెట్టడం లేదు? సమస్య ఏంటీ? అని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, సాగునీటి మంత్రి హరీశ్‌రావులు ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చారని చెప్పారు.
తర్వాత హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్లకు సంబంధించిన అంశాల బాధ్యత తనదేనని హరిరామ్ లేఖ ఇచ్చాకే డీపీఆర్ చెక్‌లి్‌స్టపై సంతకం చేశానని వెల్లడించారు. కాళేశ్వరం డిజైన్లకు సీఈ(సీడీవో)దే బాధ్యత అని, ఆయన చెక్‌లి్‌స్టపై సంతకం చేశారని వెదిరే శ్రీరామ్ ప్రకటించగా… ఇందులో వాస్తవాలేంటో ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం ద్వారా పత్రాలు సేకరించానని తెలిపారు.
ఇన్వెస్టిగేషన్లకు తానే బాధ్యత వహిస్తానని హరిరామ్ డీపీఆర్‌లో భాగంగా ఇచ్చిన లేఖను తొలగించినట్లు ఆర్టీఐ సమాచారంలో తేలిందని నరేందర్‌రెడ్డి చెప్పారు. సమాచార హక్కు ద్వారా సేకరించిన లేఖను నరేందర్‌రెడ్డి కాళేశ్వరం కమిషన్‌కు అందించారు.
సాంకేతిక అనుమతి తీసుకున్నాక డిజైన్లు/డ్రాయింగ్లు మార్చవచ్చా?అని కమిషన్ ప్రశ్నించగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు, ఇతర పారామీటర్స్, క్షేత్రస్థాయి అధికారుల నివేదికల ఆధారంగా మార్పులు చేయడానికి వీలుంటుందని బదులిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు/డ్రాయింగ్లు చేయాలని ఆదేశించింది ఎవరు? కాళేశ్వరం నిర్మాణం చేయాలనే నిర్ణయం ఎవరిది? అని కమిషన్ అడిగింది.
ఉన్నత స్థాయిలోని నిర్ణయాల ఆధారంగా చేశామని, బ్యారేజీల ఎంపిక ప్రదేశాలు ఖరారు చేసుకున్నాక స్ట్రక్చరల్ డిజైన్ల తయారీకి ఫైలును పంపించారని, ఉన్నతస్థాయిలో జరిగిన ఏ సమీక్షకూ తనను పిలవలేదని బదులిచ్చారు. ఇచ్చిన డిజైన్లు/డ్రాయింగ్ల ప్రకారం పనులు జరుగుతున్నాయా? లేవా? పరిశీలించాల్సిన బాధ్యత ఇంజనీర్‌గా మీకు లేదా? అని కమిషన్ ప్రశ్నించగా… గత ప్రభుత్వం ఆ అవకాశమే ఇవ్వలేదన్నారు.
నిర్మాణం చేపట్టడానికి ముందు బ్యారేజీలు కట్టే ప్రదేశాన్ని పరిశీలించి, ఎంత పొడవుతో కడుతున్నారనే వివరాలు తెలుసుకోవడం తప్ప మిగతా అంశాలను పరిశీలించలేదని తెలిపారు. రాఫ్ట్(పునాది), ఫైల్స్, అఫ్రాన్ పనులు, గేట్లు, పియర్స్(పిల్లర్లు), కవర్ డెప్త్లను మాత్రమే పరిశీలించామని వెల్లడించారు. మూడు బ్యారేజీల నిర్మాణంలో మీ పాత్ర ఏంటీ? అని కమిషన్ అడగ్గా, నిర్మాణపరంగా తమ పాత్ర లేదని చెప్పారు.