ఆఫ్ఘనిస్తాన్లోని ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్ (యునామ) ఆదివారం తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అమలుచేయబోతున్న కఠినమైన నైతిక చట్టంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యునామ సెక్రటరీ జనరల్ తాలూకు ప్రత్యేక ప్రతినిధి అయిన రోజా ఒటున్బయేవా, 35 ఆర్టికల్స్ కలిగి ఉన్న “ధర్మాన్ని ప్రోత్సహించడం, చెడు నివారించే చట్టం” ఆప్ఘనిస్థాన్ భవిష్యత్తుకు బాధ కలిగించే విషయం అని పేర్కొన్నారు.
విస్తృతమైన, కొన్నిసార్లు అస్పష్టమైన ఉల్లంఘనల జాబితాల కింద ఎవరినైనా బెదిరించడానికి , నిర్బంధించడానికి కొత్త చట్టాల సమితి నైతిక తనిఖీదారులకు అధికారం ఇస్తుందని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి తెలిపారు. అనైతికత కింద మహిళలను ఇబ్బంది పెట్టేందుకు తావిస్తుందని చెప్పారు. కానీ ఆయన మహిళలను నైతికత కట్టుబాట్లలో ఎలా ఉంచాలో వివరించలేదు. బహుశా మహిళలకు విశృంకలత కల్పించాలన్నది ఆయన ఉద్దేశమేమో.
వాస్తవానికి తాలిబాన్లు పెట్టిన కట్టుబడులు పొట్టి, పారదర్శక దుస్తులు ధరించొద్దని, బహిరంగ ప్రదేశాలలో ఇతరులతో (పరపురుషులతో) మాట్లాడొద్దని, పాడొద్దని, గట్టిగా చదవొద్దని మాత్రమే. మహిళలు బురఖా ధరించాలన్నది విధిగా చేశారు. ఐక్యరాజ్యసమితి ప్రతినిధి వెల్లిబుచ్చిన ఆందోళనలను తాలిబాన్లు కొట్టిపారేశారు. దేశంలో నైతికత కోసమే తమ చట్టం అని స్పష్టం చేశారు. పాశ్చాత్య దేశాలలో మాదిరి ఆఫ్ఘనిస్థాన్ లో మహిళలు విశృంఖలంగా ప్రవర్తించడానికి తావులేదన్నారు.