ఇజ్రాయెల్‌తో ఒప్పందంలో భాగంగా 2017లో భారత ప్రభుత్వం పెగాసస్ స్పై టూల్‌ను కొనుగోలు చేసినట్లు వార్తా కథనాన్ని ప్రచురించిన ది న్యూయార్క్ టైమ్స్ పత్రికను సుపారీ మీడియాగా కేంద్ర మంత్రి జనరల్ వికె సింగ్ అభివర్ణించారు.
2017లో భారత్, ఇజ్రాయెల్ మధ్య అధునాతన ఆయుధాలు, నిఘా వ్యవస్థ కోసం కుదిరిన 2 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా పెగాసస్ స్పైవేర్, క్షిపణి వ్యవస్థ భారత్ పొందిన్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఇటీవల ప్రచురించింది.
ఈ కధనం గురించి భారత ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించక పోయినప్పటికీ, కేంద్ర రోడ్డు రవాణా, హైవేలు, పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వికె సింగ్ శనివారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ `న్యూయార్క్ టైమ్స్‌ను ఎవరైనా విశ్వసిస్తారా.. సుపారీ మీడియాగా అది పేరుపొందింది’ అంటూ ఎద్దేవా చేశారు
. గత ఏడాది జూలైలో, కొత్తగా నియమితులైన ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అటువంటి వార్తా కథనాలను “సంచలనం” అని పిలవడం ద్వారా కొట్టిపారేసారు. “భారత ప్రజాస్వామ్యాన్ని, దాని బాగా స్థిరపడిన సంస్థలను కించపరిచే ప్రయత్నం” అని ఆయన విమర్శించారు.
కాగా, తాజా కథనంపై స్పందించమని కొందరు మీడియా ప్రతినిధులు కోరగా, ప్రభుత్వ సీనియర్ అధికారి నిరాకరించారు, సుప్రీం కోర్ట్ ఇప్పటికే “విషయాన్ని పర్యవేక్షిస్తుంది, పరిశోధిస్తున్నది” అని చెబుతూ ప్రభుత్వం పార్లమెంటులో ఒక ప్రకటన చేసిందని తెలిపారు.
గత ఏడాది చివర్లో, కొందరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ ఆరోపణలను పరిశీలించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, అనధికార ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశించినందున, “జాతీయ భద్రత” గురించి ప్రతిసారీ ప్రభుత్వం సర్టిఫికెట్లు పొందే ప్రయత్నం చేయదని స్పష్టం చేశారు.
సుప్రీం కోర్ట్ నియమించిన ప్యానెల్ సభ్యులు డాక్టర్ నవీన్ కుమార్ చౌదరి, గాంధీనగర్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ డీన్; డాక్టర్ ప్రబాహరన్ పి, కేరళలోని అమృత విశ్వ విద్యాపీఠంలో ప్రొఫెసర్; డాక్టర్ అశ్విన్ అనిల్ గుమాస్టే, ఐఐటి, బొంబాయిలో ఇన్స్టిట్యూట్ చైర్ అసోసియేట్ ప్రొఫెసర్. దీనిని రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ వి రవీంద్రన్ పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఏడాది జనవరి 2న, ముగ్గురు సభ్యుల ప్యానెల్ తమ పరికరాలకు స్పైవేర్ సోకిందని అనుమానించే వ్యక్తులు జనవరి 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు కమిటీని సంప్రదించాలని కోరుతూ ప్రకటన జారీ చేసింది.