త్వరలో ‘భారత్ డోజో యాత్ర’ చేపట్టనున్నట్లు కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం ప్రకటించారు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చే పాఠశాల లేదా ప్రాంతాలను డోజోగా వ్యవహరిస్తారు. భారత్ జోడోయాత్రలో భాగంగా వేలాది కిలోమీటర్లు ప్రయాణించామని, తాము బస చేసిన ప్రాంతాల్లో ప్రతి రోజూ జివు-జిత్సు (జపనీస్ మార్షల్ ఆర్ట్) ప్రాక్టీస్ చేసేవారమని తెలిపారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ గురువారం ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ ఈ కీలక ప్రకటన చేశారు. ఫిట్‌గా ఉండటానికి సులభమైన మార్గంగా ప్రారంభించిన ఈ మార్షల్ ఆర్ట్ త్వరలో కమ్యూనిటీకి చేరువైందని, తాము బస చేసిన ప్రాంతాల్లోని తోటి యాత్రికులు, యువతను, విద్యార్థులను మార్షల్ ఆర్ట్స్ ఒకచోటకు చేర్చిందని ఎక్స్‌లో పేర్కొన్నారు.
శిక్షణనిస్తున్న వీడియోలను కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో విద్యార్థులకు రాహుల్ మార్షల్ ఆర్ట్స్ సెషన్లు నిర్వహించారు. మెడిటేషన్, జివు-జిత్సు, అకిడో (జపాన్ మార్షల్ ఆర్ట్స్), అహింసావిధానంతో ఘర్షణను పరిష్కరించే పద్ధతుల సామరస్య సమ్మేళనమైన ఈ జెంటిల్ ఆర్ట్స్‌ను యువతకు పరిచయం చేయాలనే లక్ష్యంతోనే నిర్వహించామని తెలిపారు.
ఘర్షణ వాతావరణాన్ని సౌమ్యంగా మార్చే విలువల్ని వారిలో పెంపొందించాలని, దయ, సురక్షితమైన సమాజాన్ని నిర్మించేందుకు అవసరమైన సాధనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాహుల్ పేర్కొన్నారు. తాను అకిడోలో బ్లాక్ బెల్ట్, జివు-జిత్సులో బ్లూ బెల్ట్ సాధించానని తెలిపారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తన అనుభవాలను ప్రజలతో పంచుకోవాలనుకున్నానని, దీనిద్వారా కొందరిలోనైనా ఈ మార్షల్ ఆర్ట్స్‌ను నేర్చుకోవాలనే స్ఫూర్తి కలగాలని ఆశిస్తున్నానని రాహుల్ పేర్కొన్నారు.
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగిన భారత్ జోడో యాత్ర 2022 సెప్టెంబర్‌లో ప్రారంభమై.. 2023 జనవరిలో ముగిసింది. అనంతరం ఈ ఏడాది జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర మార్చి 16న ముంబయిలో ముగిసిన సంగతి తెలిసిందే.