అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన ‘అపరాజిత ఉమన్ అండ్ చైల్డ్ బిల్లు (వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ ఎమెండమెంట్)-2024ను పశ్చిమబెంగాల్ అసెంబ్లీ మంగళవారంనాడు ఆమోదించింది. ఇది ‘చరిత్రాత్మిక బిల్లు’ అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.
అత్యాచారం, లైంగిక నేరాలపై కొత్త ప్రొవిజన్స్‌తో రూపొందించిన ఈ బిల్లు మహిళలు, పిల్లలకు మరింత రక్షణ కల్పిస్తుందని తెలిపారు. ఆగస్టు 9వ తేదీన లేడీ డాక్టర్ మృతిచెందిన తర్వాత.. ఆ రోజే ఆమె పేరెంట్స్‌తో మాట్లాడినట్లు చెప్పారు. వాళ్ల ఇంటికి వెళ్లడానికి ముందే.. ఆడియో, వీడియో, సీసీటీవీ ఫూటేజ్‌ను అందజేసినట్లు చెప్పారు.
ఆదివారం వరకు సమయం ఇవ్వాలని ఆ డాక్టర్ పేరెంట్స్‌ను కోరామని, ఒకవేళ దోషిని పట్టుకోకుంటే అప్పుడు కేసును సీబీఐకి అప్పగిస్తామని చెప్పామని గుర్తు చేశారు. కానీ పోలీసులు 12 గంటల లోపే నిందితుడిని పట్టుకున్నారని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును పరిష్కరించాలని పోలీసులకు చెప్పినట్లు సీఎం వెల్లడించారు.
కానీ కేసును సీబీఐకి అప్పగించారని, అందుకే సీబీఐ ఈ కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని, నిందితుడికి మరణశిక్ష విధించాలని ముందు నుంచి డిమాండ్ చేస్తున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. అమ్మాయి హక్కులను రక్షించేందుకు ప్రతి రోజు పోరాటం చేస్తున్నట్లు చెప్పారు.
మహిళ పట్ల జరుగుతున్న వివక్షను రూపుమాపేందుకు 1981లోనే ఐక్యరాజ్యసమితి కమిటీని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఆడ పిల్లల రక్షణ కోసం గళం వినిపిస్తున్న ప్రతి ఒక్కరికీ తాను కంగ్రాట్స్ చెబుతున్నట్లు సీఎం వెల్లడించారు. కోల్‌కతా ఆర్జీ కర్ కాలేజీ ఘటనలో ఇప్పటికే ప్రధాని మోదీ రెండు సార్లు లేఖలు రాసినట్లు చెప్పారు.
ఆయన నుంచి తనకు రిప్లై రాలేదని, కానీ కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ నుంచి సమాధానం వచ్చినట్లు తెలిపారు. రేపిస్టులకు కఠిన శిక్ష విధించాలని కోరుతూ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అపరాజిత బిల్లు పాసైంది. కాగా, బిల్లుకు ప్రధాన విపక్షమైన బీజేపీ మద్దతు ప్రకటించింది.