ఉత్తరకొరియా మధ్యంతర శ్రేణి క్షిపణిని ఆదివారం పరీక్షించడంపై ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. భూమి నుంచి 2,000 కిలోమీటర్ల ఎత్తుకు దూసుకెళ్లిన ఈ క్షిపణి అనంతరం జపాన్ సముద్రంలో కూలిపోయింది. ఆదివారం ఉదయం 7.52 సమయంలో ఈ క్షిపణిని ప్రయోగించింది.
బాలిస్టిక్స్, న్యూక్లియర్స్ ఆయుధాల పరీక్షలపై ఐక్యరాజ్యసమితి నిషేధం విధించినప్పటికీ ఉత్తర కొరియా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. కాగా, జనవరిలో ఇది ఏడవ ప్రయోగం కావడం గమనార్హం. ఈ పరీక్షను జపాన్, దక్షిణ కొరియా, అమెరికా ఖండించాయి. దీర్షకాలంగా నిలిచిపోయిన అణుచర్చల విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది.
తమ దేశ రక్షణను బలోపేతం చేస్తానని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. చైనా వింటర్ ఒలింపిక్స్, మార్చిలో దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికల ముందు ఈ పరీక్షలు జరగడం తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది.
2 వేల కిలోమీటర్లు ఎత్తుకు చేరుకుని.. 30 నిమిషాల పాటు ప్రయాణించి, 800 కిలోమీటర్ల దూరంలో ఈ క్షిపణి కూలిందని జపాన్, దక్షిణ కొరియా అధికారులు అంచనా వేశారు. ఇటువంటి అస్థిరపరిచే చర్యలను మానుకోవాలని ఉత్తర కొరియాను అమెరికా హెచ్చరించింది.
2017లో ఉత్తరకొరియా అనేక పరీక్షలు నిర్వహించిందని, అతిపెద్ద క్షిపణులను ప్రయోగించిందని, ఆ సమయంలో కొన్ని జపాన్ పై నుండి కూడా ప్రయోగించిందని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జెఇన్ గుర్తు చేశారు. అప్పటి ఉద్రిక్త పరిస్థితులే ఇప్పుడు పునరావృతమౌతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ క్షిపణి 2017లో ప్రయోగించిన హాసాంగ్-12 బాలిస్టిక్ క్షిపణితో పోలి ఉన్నట్లు చెబుతున్నారు. 2018లో అణుపరీక్షలు, దీర్ఘశ్రేణి క్షిపణుల పరీక్షలపై స్వీయ మారిటోరియం విధించుకొన్నట్లు కిమ్ ప్రకటించగా, 2019లో మారిటోరియం తొలగిస్తున్నట్లు ప్రకటించారు.