కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మోదీ ఫోబియాతో బాధపడుతున్నారని గోవాలో ఆదివారం ఒకరోజు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు.
పొండాలో జరిగిన సభను ఉద్దేశించి బిజెపి నాయకుడు మాట్లాడుతూ, గాంధీ కుటుంబానికి గోవా కేవలం వెకేషన్ స్పాట్ అని ఎద్దేవా చేశారు.
అయితే బిజెపి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందని ఆయన గుర్తు చేశారు. “మేము రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 432 కోట్ల (2013-14) నుండి రూ. 2,567 కోట్లకు (2021లో) పెంచాము. మాజీ దిగంబర్ కామత్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఏమీ చేయలేదు. మేము వాగ్దానం చేసాము” అని తెలిపారు.
కాంగ్రెస్‌ని వీడి ఇటీవల బీజేపీలో చేరిన పార్టీ అభ్యర్థి, గోవా మాజీ సీఎం రవి నాయక్ తరఫున షా ప్రచారం చేస్తూ బీజేపీ ‘గోల్డెన్ గోవా’, కాంగ్రెస్ ‘గాంధీ పరివార్ కా గోవా’ రెండింటిలో ఒకటి ఎంచుకోవాలని రాష్ట్ర ప్రజలను కోరారు. చిన్న రాష్ట్రాల అభివృద్ధి నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తున్నదని ఆయన చెప్పారు.
గోవా శాసన సభ ఎన్నికల్లో బీజేపీ 22కుపైగా స్థానాలను గెలుచుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి పూర్వం గోవాలో అస్థిరత ఉండేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి ప్రభంజనాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు.
గోవాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని, బీజేపీ మాత్రమే చేయగలదని అమిత్ షా స్పష్టం చేశారు.
గోవా ఎన్నికల్లో పోటీ చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలను కొట్టిపారేసిన అమిత్ షా, ఈ పార్టీలు తమ పరిధిని విస్తరించుకోవడం లేదా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం కోసమే రంగంలోకి దిగాయని చెప్పారు.
మనోహర్ పారికర్ కు ఘనంగా నివాళులు
మాజీ రక్షణ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కు ఘనంగా నివాళులు అర్పిస్తూ అమిత్ షా గోవాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గోవాకు భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చిన మహా నాయకుడు పారికర్ అంటూ ప్రశంసించారు.
గోవాలో అభివృద్ధికి విత్తనాలు నాటింది పారికర్ అని చెబుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి గౌతమ్ సావంత్ వాటిపై నిర్మాణాలు చేస్తున్నారని చెప్పారు. పారికర్ కలలను సాకారం చేస్తూ `బంగారు గోవా’ను నిర్మించడమే బిజెపి ధ్యేయం అని ఆయన స్పష్టం చేశారు. గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ తన అభ్యర్థులను బరిలోకి దించింది.