కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో బీజేపీ, ఆరెస్సెస్‌పై చేసిన వ్యాఖ్యలను బిజెపి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించేలా మాట్లాడటం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని దుయ్యబడుతున్నారు. రాహుల్ విదేశీ పర్యటనలో అర్ధరహిత, నిరాధార, తప్పుదారి పట్టించే అవాస్తవాలను పదేపదే వల్లెవేస్తున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తప్పుపట్టారు.
రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటని, అవి దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో సిక్కులను గురుద్వారల్లో తలపాగాలను ధరించనీయడం లేదని, తమ మతాచారాలను పాటించకుండా నిరోధిస్తున్నారని రాహుల్ చెప్పారని ఇది పూర్తిగా సత్యదూరమని రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఎన్డీయే ప్రభుత్వం రిజర్వేషన్లను తొలగించాలని కోరుకుంటున్నదని ప్రచారం చేశారని ఇది నిరాధార ఆరోపణని మంత్రి పేర్కొన్నారు.
అమెరికా పర్యటనలో చైనా సరిహద్దు విషయంలోనూ తప్పుదారిపట్టించే అవాస్తవాలను మాట్లాడారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రేమ దుకాణానికి బదులు అసత్యాల దుకాణం తెరిచారని ఎద్దేవా చేశారు. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడం ఆయన మానుకోవాలని హితవుపలికారు. విపక్ష నేతగా రాహుల్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు.
కాగా, దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం, దేశాన్ని విఛ్చిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీ నేతలకు అలవాటుగా మారిందని హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్ గాంధీకి తాను ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నానని, బీజేపీ ఉన్నంతకాలం దేశంలో రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరని స్పష్టం చేశారు.
అదేవిధంగా దేశ భద్రతతో ఎవరూ ఆటలాడలేరని అమిత్ షా హెచ్చరించారు. రాహుల్ గాంధీ ప్రతిసారీ దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారని ఆరోపించారు. ఆయన దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాంతీయ వాదం, మతం, భాష పరంగా చీలికలు తెచ్చే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను రాహుల్ గాంధీ ప్రకటన మరోసారి బయటపెట్టిందని అమిత్ షా వ్యాఖ్యానించారు.