గత ఏడాది విశేషమైన ప్రజా మద్దతుతో, ఎన్నో మార్పులు తీసుకు రాగలననే విశ్వాసంతో అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన జో బైడెన్ సంవత్సరకాలంలోనే ప్రజాకర్షణను కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశం ఎదుర్కొంటున్న అనేక జటిల సవాళ్ళను ఎదుర్కోవడంలో ఆయనకు గల సమర్ధతపై ప్రజలలో విశ్వాసం క్రమంగా సన్నగిల్లుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ముఖ్యంగా మొత్తం ప్రపంచాన్ని కకావికలం కావించిన కరోనా మహమ్మారి సమయంలో ప్రజారోగ్యం విషయంలో ఆయన పాలనా సమర్ధత పట్ల ఆ దేశ ప్రజానీకం అనుమానాలు వ్యక్తం చేయడం ప్రారంభమైనది. దానితో తన పదవీకాలం రెండో యేడాదిని సన్నగిల్లుతున్న ప్రజా మద్దతుతో ప్రారంభించినట్లయింది. పలు జటిలమైన అంశాలపై ఆయన ధోరణి స్పష్టంగా లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి.
తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న డోనాల్డ్ ట్రంప్ స్థానంలో వచ్చిన బైడెన్ విదేశాంగ విధానం నుండి పలు కీలక అంశాలలో ఆయనకన్నా భిన్నమైన విధానాలను ముందుకు తీసుకు రాలేకపోతున్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజాగా జరిపిన ప్రజాభిప్రాయంలో 41 శాతం మంది అమెరికా వయోజనులు బైడెన్ పనితీరును ఆమోదించారు. అయితే గత సెప్టెంబర్ లో లభించిన 44 శాతం ఆమోదంకన్నా కొంచెం తక్కువ కాగా, గత ఏడాది అప్రిలోని 59 శాతంకన్నా గణనీయంగా పడిపోవడం గమనార్హం.
కరోనా రూపాంతరం ఓమిక్రాన్ అమెరికా అంతటా వ్యాపిస్తుంది. ఇప్పుడు 44 శాతం మంది అమెరికా ప్రజలు మాత్రమే కరోనా కట్టడిలో ఆయన సామర్ధ్యం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మార్చ్ లో 65 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం.
గత పది నెలల కాలంలో ఆయన క్లిష్టమైన రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు స్పష్టం అవుతున్నది. అమెరికాలో వ్యవహారాలు జరుగుతున్న తీరు పట్ల కేవలం 21 శాతం (గత ఫిబ్రవరి లో 36 శాతం) మంది ప్రజలు మాత్రమే సంతృప్తి చెందుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై సహితం ప్రజాభిప్రాయం ప్రతికూలంగా కనిపిస్తున్నది.
కేవలం 28 శాతం మంది మాత్రమే ఆర్థిక పరిస్థితులు అద్భుతంగా ఉన్నాయని లేదా బాగున్నాయని చెప్పారు. మెజారిటీ ప్రజలు ఆహారం, వినియోగ వస్తువుల ధరలు (89%) , గ్యాస్ ధరలు (82%) ఒక సంవత్సరం క్రితం కంటే అధ్వాన్నంగా ఉన్నాయని భావిస్తున్నారు.
అయితే, ఏడాది క్రితంతో పోలిస్తే ఉద్యోగాల లభ్యత మెరుగుపడిందని 56 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఉపాధి గత సంవత్సరంలో కొంత పుంజుకుంది, 6.4 మిలియన్ ఉద్యోగాలను జోడించారు. మొత్తం మీద ఉపాధి మహమ్మారి ముందు నాటికన్నా తక్కువగా ఉన్నప్పటికీ, ఉద్యోగం కోరుతున్న వారి సంఖ్య 50 సంవత్సరాలలో గరిష్టంకు చేరుకొంది.
అయితే ప్రజలు ఇతరత్రా ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తున్నది. లక్షలాది మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను వదులుకున్నారు. ఇది జాబ్ మార్కెట్‌పై విశ్వాసాన్ని చూపుతున్నప్పటికీ, కొన్ని పరిశ్రమలు ఇప్పుడు కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి, ప్రపంచ సరఫరా-గొలుసు సమస్యలకు దోహదం చేస్తున్నాయి. ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ప్రారంభించిన దాదాపు రెండు సంవత్సరాల తరువాత, మెజారిటీ ప్రజలు కరోనా ఆర్థిక వ్యవస్థకు (69%), దేశ. జనాభా ఆరోగ్యానికి (57%) పెద్ద ముప్పు అని చెబుతూనే ఉన్నారు.
ఆందోళనకరమైన అంశం ఏమిటంటే ఆయన పాలనాతీరు పట్ల డెమొక్రాట్ల నుండే మద్దతు పడిపోతున్నది. కేవలం 29 శాతం మంది మంది డెమొక్రాట్లు మాత్రమే సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇక సహజంగానే, రిపబ్లికన్ లు ఆయన పాలనా తీరు పట్ల అత్యధికంగా విముఖత వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
మొత్తం మీద ప్రజానీకం రిపబ్లికన్ పార్టీ కంటే డెమోక్రటిక్ పార్టీ పట్ల మరింత సానుకూలంగా ఉంటూ ఉండడం కొంతమేరకు ఉపశమనం కలిగిస్తుంది. అయితే, మెజారిటీ ప్రజలు రెండు పార్టీల పట్ల ప్రతికూల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వైరస్ కలిగించిన ఆరోగ్య ప్రభావాన్ని ఎదుర్కోనే విధానాలతో సహా అనేక కీలకమైన విధాన రంగాలలో రిపబ్లికన్లతో కంటే డెమొక్రాట్ల పట్ల ఎక్కువ మంది అమెరికన్లు సానుకూలంగా కనిపిస్తున్నారు.
తాజాగా జనవరి 19, 20 తేదీలలో నిర్వహించిన రాయిటర్స్/ఇప్సోస్ ఒపీనియన్ పోల్ ప్రకారం, 43 శాతం మంది అమెరికా ప్రజలు బైడెన్ పనితీరు పట్ల ఆమోదం తెలిపారు. అయితే 52 శాతం శాతం మంది ఆమోదించలేదు. అంతకు ముందు వారం 45 శాతం మంది ఆమోదం తెలపడం గమనార్హం.
అధికారంలోకి వచ్చిన మొదటి నెలల్లో 50 శాతం కన్నా ఎక్కువ ప్రజామోదం పొందిన బైడెన్ ప్రజాకర్షణ గత ఆగష్టు నుండి తగ్గుముఖం పెరుగుతూ వస్తున్నది. ముఖ్యంగా కరోనా మరణాలు పెరగడం, ఆఫ్ఘానిస్తాన్ నుండి సేనలు వైదొలగిన తీరు ప్రజలలో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది. దేశ ఆర్ధిక వ్యవస్థ, ప్రజారోగ్యం పట్ల ప్రజలు ప్రధానంగా ఆందోళన చెందుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
బైడెన్ పట్ల ప్రజాదరణ క్షీణిస్తూ ఉంటే వచ్చే నవంబర్ 8న జరుగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ లో తాము మెజారిటీ కోల్పోవలసి వస్తుందని డెమొక్రాట్లు ప్రధానంగా ఆందోళన చెందుతున్నారు. రిపబ్లికన్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లేదా సెనేట్‌పై నియంత్రణను తీసుకుంటే, బిడెన్ పాలనా ఇక స్థంభించినట్లే కాగలదని కలవరం చెందుతున్నారు.
తన మొదటి సంవత్సర పాలన అమెరికా ప్రజలకు నిరాశ మిగిల్చింనట్లు బైడెన్ స్వయంగా గత వారం ఒక మీడియా సమావేశంలో అంగీకరించారు. కరోనా మహమ్మారి, ద్రవ్యోల్బణం నుండి ఎదురవుతున్న గణనీయమైన సవాళ్లతో పోరాడుతూ పురోగతి సాధించాలని ప్రతిజ్ఞ చేసాడు.
బైడెన్ పదవి చేపట్టినప్పుడు ఘోరమైన వైరస్ ముప్పును తొలగిస్తానని, వాషింగ్టన్లో ప్రతిస్పందించే పాలనతో పాటు ద్వైపాక్షికత యొక్క కొత్త శకాన్ని ప్రారంభిస్తానని వాగ్దానం చేశాడు. తన అధ్యక్ష పదవికి ఒక సంవత్సరం తర్వాత కూడా కరోనా సంక్షోభం వేధిస్తూనే ఉంది. మరోవంక, 2020 ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్ గెలిచాడనే “పెద్ద అబద్దం” లో రిపబ్లికన్ పార్టీ కొనసాగుతున్నది.
కరోనా మహమ్మారిని నిర్ములించడం అసాధ్యమని, దానిని నియంత్రించడమే చేయగలని చెప్పడం ద్వారా ఈ మధ్యనే బైడెన్ వాస్తవంలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే ప్రస్తుతం అమెరికాతో పాటు మొత్తం ప్రపంచం ఎదుర్కొంటున్న కఠినమైన సమయంలో జో బిడెన్ కొంతవరకు నిస్సహాయంగా ఉండిపోయారని పలువురు నిపుణులు అంగీకరిస్తున్నారు.
నెలల తరబడి డెమొక్రాటిక్ ప్రజా ప్రతినిధులు, మద్దతుదారులు కీలక విభాగాలలో అధ్యక్షుడికి మద్దతు కోల్పోతున్నామనే ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వాతావరణ మార్పు, ఆరోగ్య సంరక్షణ, విద్యార్థుల రుణమాఫీపై నిష్క్రియాత్మకతపై యువ ఓటర్లలో ఆయన పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.
బైడెన్ విజయానికి కీలకమైన నల్లజాతి ఓటర్లలో మద్దతు తగ్గుతూ ఉండడం మరింత ఆందోళనకు కారణం అవుతున్నది. ఓటింగ్ హక్కులు, పోలీసు సంస్కరణలపై ఇచ్చిన హామీల అమలులో పురోగతి లేకపోవడంతో నిరాశ వ్యక్తం అవుతున్నది.
మెజారిటీ అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలని మొగ్గు చూపినప్పటికీ, అమెరికా దళాలు నిష్క్రమించగానే కాబూల్ నుండి తాలిబాన్ దళాల దుష్రయాలను చూసిన ప్రపంచంపై అమెరికా విదేశాంగ విధానంపై బిడెన్ అవగాహన పట్ల అనుమానాలు రేకేకేతించాయి. అమెరికా నుండి సైనిక దళాలు నిష్క్రమించిన విధానం బిడెన్ ప్రతిష్టకు భాగం కలిగించినట్లు సర్వత్రా భావిస్తున్నారు.
సామూహిక టీకా కార్యక్రమంతో పాటల మహమ్మారి నుండి ఉపశమనం కోసం ట్రిలియన్ల డాలర్లు కేటాయిస్తూ బిడెన్ పలు చర్యలు తీసుకున్నప్పటికీ అంతకు ముందుకన్నా పరిస్థితులు క్షీణించాయనే ప్రజలు భావిస్తున్నారు. మరోవంక, ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి ద్వారా అమెరికా ఆర్ధిక వ్యవస్థ పునరుద్ధరణకు బిడెన్ తీసుకున్న చర్యలు కొంతవరకు సానుకూలతను కలిగిస్తున్నాయి.