కరోనా పోరులో భారత్ పోరు స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కొనియాడారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ కరోనా సమయంలో ప్రజలు ఆకలితో ఉండకుండా చూశామన్నారు. కరోనా సమయంలో అందరూ ఒక టీంగా పనిచేశారని ప్రశంసించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
ప్రతి భారతీయుడికి స్వాతంత్య్ర అమృతోత్సవ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు. దేశాభివృద్ధి ప్రయాణంలో దోహదపడిన వ్యక్తులను స్మరించుకుంటున్నామని రాష్ట్రపతి పేర్కొన్నారు. దేశ సురక్షిత భవిష్యత్ కోసం గతాన్ని గుర్తుతెచ్చుకోవడం ముఖ్యమని చెబుతూ వచ్చే 25 ఏళ్లపాటు పునాదులు పటిష్టంగా ఉండేలా ప్రభుత్వం కృషిచేస్తోందని కోవింద్ తెలిపారు.
జల్ జీవన్ మిషన్ తో రూ.6కోట్ల గ్రామాలకు నీళ్లందించామని చెబుతూ వ్యాక్సినేషన్ లో భారత్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. దేశంలో ఏడాదిలో 150 కోట్ల డోసులకు పైగా కరోనా వ్యాక్సినేషన్ పూర్తయిందని చెబుతూ ఫార్మా పరిశ్రమను విస్తరించేందుకు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
కిసాన్ సమ్మాన్ నిధితో రైతుల ఖాతాల్లోకి డబ్బులు వచ్చాయని చెబుతూ మహిళా సాధికారతకు టాప్ ప్రయారిటీ ఇస్తున్నామని రాష్ట్రపతి పేర్కొన్నారు. గరీభ్ కళ్యాణ్ యోజనతో 2 కోట్ల పేద కుటుంబాలకు ఇళ్లు ఇచ్చామని చెప్పారు. జన్ ధన్ యోజనతో పేదలకు బ్యాంకు అకౌంట్లు ఇచ్చామన్నారు.
నూతన విద్యావిధానంతో ప్రాంతీయ భాషలకు ప్రాముఖ్యత ఇచ్చామని కోవింద్ గుర్తు చేశారు. భేటీ బచావో భేటీ పడావోతో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూఖేలో ఇండియా స్కీం ద్వారా క్రీడాకారులకు ప్రోత్సాహం ఇస్తున్నామని వివరించారు.
దేశంలోని రైతులందరికీ సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి ప్రశంసించారు. కీలక విధానాల్లో రైతులు, చిన్నరైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల ఆదాయం పెరిగేందుకు పలు చర్యలు తీసుకుందని చెప్పారు.
దేశ వ్యవసాయ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లు దాటాయని చెప్పారు. 2020-21 కోవిడ్ మహమ్మారి సమయంలోనూ 30 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు పండించారని, 33 కోట్ల హార్టీకల్చర్ ఉత్పత్తులు సాధించారని చెప్పారు. ప్రభుత్వం 433 లక్షల మెట్రిక్ టన్నుల గోదువులు సేకరించిందని, దీంతో 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని చెప్పారు.
స్వాతంత్ర్యం, సమత్వం, సామరస్యం ఆధారిత సమాజమే ఆదర్శ సమాజమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను రాష్ట్రపతి తన ప్రసంగంలో గుర్తుచేశారు. ప్రజాస్వామ్య పునాదులు ప్రజలను గౌరవించడంలోనే ఉందని, బాబాసాహెబ్ మార్గదర్శక సూత్రాలు, సిద్ధాంతాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.