ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఏర్పడి వంద రోజులు దాటింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని, ప్రజలు వాటికి సాక్ష్యాలుగా నిలిచినట్లు ఆయన పేర్కొన్నారు.
అమిత్ షాతో పాటు మంత్రులు అశ్వినీ వైష్ణవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 రోజుల పాలనలో సాధించిన ప్రగతిపై రూపొందించిన ఓ బుక్లెట్ను అమిత్ షా ఆవిష్కరించారు. పదేళ్ల అభివృద్ధి, భద్రత, సంక్షేమం తర్వాత ప్రజలు మూడవ సారి బీజేపీ మిత్ర కూటమిని మరోసారి ఆశీర్వదించారని ఆయన పేర్కొన్నారు. గడిచిన 60 ఏళ్లలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని చెప్పారు.
ఇది దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకువచ్చిందని, పాలసీలను సమర్థవంతంగా అమలు చేశామని తెలిపారు. ప్రధాని మోదీ తీసుకువచ్చిన కొత్త విద్యా విధానంలో.. ప్రాచీన, ఆధునిక విద్యా వ్యవస్థలు ఉన్నట్లు తెలిపారు. ఆ విద్యా వ్యవస్థ ప్రాంతీయ భాషలను గౌరవిస్తుందని హోంమంత్రి తెలిపారు.
వంద రోజుల పాలన సమయంలో.. సుమారు మూడు లక్షల కోట్ల ప్రాజెక్టులను ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు. గత పదేళ్లలో ఇండ్లు, టాయిలెట్లు, గ్యాస్ కనెక్షన్లు, త్రాగునీరు, విద్యుత్తు, ఉచిత ఆహార ధాన్యాలు, ఆరోగ్యం అందించినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల వరకు దేశంలో ఇండ్లు లేని వారు ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేయనున్నట్లు అమిత్ షా తెలిపారు.
25 వేల మారుమూల గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం, మహారాష్ట్రలోని వాధవన్లో భారీ ఓడరేవు నిర్మాణం వంటివి ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయని వెల్లడించారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పెంచామని, ఉల్లిపాయలు, బాస్మతీ బియ్యంపై కనీస ఎగుమతి ధరను (ఎంఈపీ) తొలగించామని పేర్కొన్నారు.
ముడి పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెల దిగుమతి సుంకాన్ని పెంచామని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే భారత్ గొప్ప ఉత్పత్తి కేంద్రంగా మారిందని గర్వంగా చెప్పగలనని అమిత్ షా వ్యాఖ్యానించారు. అంతరిక్ష రంగంలో దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని ప్రపంచం అంగీకరిస్తోందని వెల్లడించారు