వైసిపి పాలనలో తిరుమల లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉండేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కమీషన్ల కోసమే వైఎస్సార్సీపీ నేతలు లడ్డూ నాణ్యతలో రాజీపడ్డారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడే కాంట్రాక్టర్‌ను మార్చారని, గత ఐదేళ్లలో టీడీపీ అక్రమాలపై విచారణ జరిపిస్తామన్న కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డిడిబి క్యాల్ఫ్ ల్యాబ్ నిర్ధారించిన నేపథ్యంలో వైఎస్సార్సీపీపై అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శ్రీవారి లడ్డు నాణ్యత అంశంపై తితిదే ఛైర్మన్లుగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీటీడీ మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు ఓవీ రమణ తప్పుపట్టారు.
శ్రీవారి లడ్డూకు ఉపయోగించే నెయ్యి సరఫరా టెండర్‌ను గతంలో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి దిల్లీకి చెందిన ఆల్ఫా అనే సంస్థకు ఇచ్చారని తెలిపారు. ఆల్ఫా సంస్థ విదేశాల నుంచి బట్టర్ ఆయిల్ దిగుమతి చేసి రకరకాల కెమికల్స్ ద్వారా ఆవు నెయ్యిగా టీటీడీకి సరఫరా చేసిందని ఆరోపించారు. సరఫరా చేసిన నెయ్యిని నామమాత్రంగా పరీక్షించి వినియోగించారని చెబుతూ కూటమి ప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
లడ్డూ నాణ్యతను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తగ్గించిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. కమీషన్ల కొసమే లడ్డు నాణ్యత తగ్గించారని ధ్వజమెత్తారు. కమీషన్లు తీసుకున్న టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడే అర్హత కొల్పోయారని మండిపడ్డారు. నాణ్యత కమిటీ సభ్యులు 9 సంవత్సరాలుగా కొనసాగుతున్నా వారిని మార్చలేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భూమన కరుణాకర రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి టీటీడీ నిధుల నుంచి కమీషన్లు తీసుకొని శ్రీవారి ఆలయాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు.
తిరుమలలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి చెప్పారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి గురించి అధికారులకు తెలిపిన విషయాలే సీఎం చంద్రబాబు చెప్పారని ఆయన స్పష్టం చేశారు.
శ్రీవారి నెయ్యి సరఫరాలో గత ప్రభుత్వంలో కల్తీ చేయడం దారుణమని టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ మండిపడ్డారు. 30 శాతం కమీషన్ల కోసం టీటీడీ ఖజానాను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి లూఠీ చేశారని ఆరోపించారు. టీటీడీలో ఇంకా వైఎస్సార్సీపీ వాసన పోలేదని, అక్రమాలకు పాల్పడిన ఎవరినీ వదలమన్నారు.
సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా కుటుంబ సభ్యులతో తిరుమల వచ్చారా అని ప్రశ్నించారు. కరుణాకర్ రెడ్డి తన కుమారుడ్ని ఎమ్మెల్యే చేయాలని టీటీడీ నిధులను ఇష్టారాజ్యంగా పక్కదారి పట్టించారని ఆరోపించారు.
తిరుమలలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే ఆ ఘటనపై విచారణ చేపట్టాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు. తక్షణం సిబిఐతో విచారణ జరిపించాలని ఆమె కోరారు. ఇంతటి ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చాలని ఆమె స్పష్టం చేశారు. వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల రెడ్డి డిమాండ్ చేశారు.