టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఎజిఆర్)లో బకాయిల గణనలో తప్పులను సరిదిద్దాలంటూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ సహా పలు కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. టెలికాం కంపెనీల పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
క్యూరేటివ్ పిటిషన్లను ఓపెన్ కోర్టులో విచారించేందుకు జాబితా చేయాలని కంపెనీలు కోరాయి. క్యురేటివ్ పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో చివరి ప్రయత్నం.. ఆ తర్వాత కోర్టును ఆశ్రయించడానికి చట్టపరమైన మార్గం ఉండదు. సాధారణంగా ఇలాంటి పిటిషన్స్‌ని న్యాయమూర్తులు ఛాంబర్లో పరిశీలించి.. విచారణకు అర్హత ఉందో.. లేదో నిర్ణయిస్తారు.
ప్రత్యేకంగా అభ్యర్థలు ఉంటే ఓపెన్ కోర్టులో విచారణకు అనుమతిస్తారు. క్యూరేటివ్ పిటిషన్లను ఓపెన్ కోర్టులో లిస్ట్ చేయాలన్న పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. గత ఏడాది అక్టోబర్ 9న కొన్ని టెలికాం కంపెనీల వాదనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇందులో, సర్దుబాటు చేసిన స్థూల రెవెన్యూ (ఎజిఆర్) బకాయిల సమస్యపై వారి పిటిషన్స్ను జాబితా చేయాలని టెలికం కంపెనీలు కోరాయి.
ఏజీఆర్ బకాయిల డిమాండ్‌లో లోపాలను సరిదిద్దాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఇంతకు ముందు జూలై 2021లో కోర్టు తిరస్కరించింది. ఏజీఆర్ బకాయిలను నిర్ణయించడంలో అనేక లోపాలున్నాయని.. మొత్తం రూ.లక్ష కోట్లకు పైగా ఉన్నాయంటూ టెలికాం కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.