ఉక్రెయిన్ విషయంలో యుద్ధ మేఘాలు ఆవరించడం, రష్యా ఆ దేశాన్ని ఆక్రమించుకొని ప్రయత్నం చేస్తున్నదనే కధనాలు వెలువడుతున్న దృష్ట్యా అటువంటి పరిస్థితి ఏర్పడితే రష్యాపై ఆంక్షలు విధించేందుకు అమెరికా కసరత్తు చేస్తున్నట్లు వెల్లడైనది. ఆంక్షలు విధించాల్సి వస్తే ఆ ఆంక్షలను చాలా రహస్యంగా వుంచుతామని అమెరికన్ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
వాటిని ముందుగానే రష్యా తెలుసుకునే అవకాశం లేదని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి విక్టోరియా నూలాండ్ తెలిపారు. రష్యాపై విధించాల్సిన ఆంక్షలపై అమెరికా కసరత్తు చేస్తోందని చెప్పారు. ఆ ఆంక్షలు ఏ రీతిలో వుండబోతున్నాయో రష్యా ముందుగానే తెలుసుకునే వీలు కూడా లేదని పేర్కొన్నారు. ”ఈ ఆంక్షల ప్యాకేజీకి సంబంధించి…మేమేం చేయబోతున్నామనే విషయంలో కొంతమేరకు వ్యూహాత్మక సందిగ్థత నెలకొన్నపుడు ముందుగా మాట్లాడకుండా వుండడం మంచింది.” అని తెలిపారు.
”అవి, ఆర్థికపరమైన చర్యలా, ఎగుమతుల నియంత్రణలా, రష్యా ప్రముఖులపై కొత్త ఆంక్షలా ఏవైనా కావచ్చు, వీటిని ఇప్పుడే వెల్లడించినట్లైతే రష్యా వాటి ప్రభావాన్ని తగ్గించడానికి చూడొచ్చు, అప్పుడు మాకు ఎలాంటి లాభం వుండదు.’ అని చెప్పారు.
ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగిన పక్షంలో తక్షణమే అమల్లోకి వచ్చేలా కొన్ని ఆంక్షలను రూపొందించడంపై సెనెటర్ బాబ్ మెనెండెజ్ నేతృత్వంలోని అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల బృందం ఒక అంగీకారానికి వచ్చినట్లు పేర్కొన్న నేపథ్యంలో నూలాండ్ ప్రకటన వెలువడింది.
అయితే రష్యా బ్యాంకులపై, ఎగుమతులపై, నిర్దిష్ట ఉత్పత్తులకు సంబంధించిన దిగుమతులపై ఆంక్షలు వుండవచ్చని సూచనప్రాయంగా వార్తలు వెలువడుతున్నాయి. ఇయుతో కలిసి కూడా అమెరికా ఈ విషయమై కసరత్తు చేస్తోంది.
మరోవంక, పశ్చిమ యూరప్ దేశాలు గ్యాస్ సరఫరా కోసం రష్యాపై ఆధారపడడం తగ్గించుకోవాలని నాటో హెచ్చరించింది. ఇంధనదిగుమతులను తగ్గించుకోవాలని, ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అది సలహా ఇచ్చింది. ఇయు గ్యాస్ దిగుమతుల్లో 41శాతం రష్యా నుండే వస్తాయి. ముడిచమురు దిగుమతులు కూడా 26.9శాతంగా వున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా గల ఇతర వనరుల నుండి సకాలంలో, తగినంత మొత్తంలో యూరపు దేశాలకు ఖనిజ వాయువు సరఫరాలు అందేలా అమెరికా, ఇయు కసరత్తు చేస్తున్నాయని ఇయు కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెన్ లేయన్, అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.