ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు నకిలీ సమాజ్‌వాద్.. పేదల ప్రభుత్వం మధ్య జరుగుతున్నవిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. వచ్చే నెల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తొలి దశలో భాగంగా ఓటింగ్ జరిగే ముజఫర్ నగర్, బాగ్పట్, సహరాన్పూర్, గౌతమ్ బుద్ధ నగర్ ఓటర్లనుద్దేశించి.. తొలి వర్చువల్ సమావేశాన్ని ప్రధాని మోదీ నిర్వహించారు.
‘యుపిలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ ప్రతిపక్షం ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. అటువంటి వారికే ఈ పార్టీ టికెట్లు ఇస్తోంది.అందుకు వారి ప్రవర్తనే నిదర్శనం. నేరస్తులు రాష్ట్రంలో స్నేహపూర్వక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు’ అని మండిపడ్డారు.
అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రస్తుత ఎన్నికలలో గెలుపుకోసం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నదని ప్రధాని ఆరోపిస్తూ బిజెపిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓటర్లను ప్రేరేపిస్తుందని ధ్వజమెత్తారు.
యుపిలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ అభివృద్ధి విధానాలకు చాలా దూరంగా ఉందని ఎస్పి చెబుతోందని గుర్తు చేస్తూ పేదలకు ఇళ్లు, వెనుకబడిన వర్గాలకు పథకాలు, మెడికల్ కాలేజీలు, ఎక్స్‌ప్రెస్‌వేల ద్వారా కనెక్టివిటీ, ముస్లిం మహిళలకు కార్యక్రమాలు, మహిళలకు సంబంధించి వివిధ పథకాలు గురించి ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు.
‘ఈ రోజుల్లో.. ప్రజలు చాలా కలలుగంటున్నారు. నిద్రపోయే వారికే ఆ అవకాశం’ అని ఎద్దేవా చేశారు. దీన్ని అఖిలేష్ యాదవ్‌కు ముడిపెడుతూ.. ఎద్దేవా చేశారు. యుపిలో తానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ప్రతి రోజు కలలోకి వచ్చిన శ్రీకృష్ణుడు చెప్పాడంటూ అఖిలేష్ యాదవ్ అంటున్నారని అవహేళన చేశారు.
నోయిడా, గ్రేటర్ నోయిడాలోని పట్టణ ప్రాంతాల్లోని గృహాల సమస్యలపై మాట్లాడుతూ.. అవినీతి కారణంగానే అక్కడ ప్లాట్లను కొనుగోలు చేసిన వేలాది మంది సమస్యల్లో కూరుకున్నారని ప్రధాని విమర్శించారు. అసంపూర్తిగా ఉన్న ప్లాట్లను పూర్తి చేసేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీనిచ్చారు.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రతి కుటుంబాన్ని భారత్ ఆదుకుంటుందని, ఈ పథకం ద్వారా 15 కోట్ల మంది ఉచితంగా రేషన్ పొందుతున్నారని మోదీ తెలిపారు. ఇదే యుపి 5 సంవత్సరాల క్రితం, పేదలకు అందించాల్సిన రేషన్ దొంగతనానికి గురైందని, కాని నేడు పేదలకు చేరుతోందని చెప్పారు.
గత ఐదేళ్లలో వచ్చిన మార్పు ఇదేనని పేర్కొన్నారు. తాము ఇప్పుడు చిన్న రైతుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, వారి కోసమే పనిచేయడం ప్రారంభించామని, చిన్న రైతుల గ్రామీణ కోణాన్ని మారుస్తామని ప్రధాని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో పశ్చిమ యుపి అల్లర్ల కారణంగా తగలబడుతుంటే అధికారంలో ఉన్న వారు సంబరాలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఐదేళ్ల క్రితం దబాంగ్(కండబలం ఉన్నవాళ్లు), దంగల్ (విధ్వంసకారులు) చట్టాన్ని తమ చుట్టం చేసుకున్నారని, వారు చెప్పిందే వేదంగా ప్రభుత్వం పాటించిందని ఆయన ఆరోపించారు.
ఆ రోజుల్లో వ్యాపారులను దోపిడీచేశారని, ఆడపిల్లలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు కూడా కాదని ప్రధాని పేర్కొన్నారు. తమ సొంత దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్ పట్ల నమ్మకం లేని వాళ్లు, వదంతులు రాజేసేవాళ్లు ఉత్తర్ ప్రదేశ్ యువతలోని ప్రతిభను ఎలా గౌరవించగలరని అంటూ అఖిలేష్ ను ఎద్దేవా చేశారు.