దేశ పౌరులు తమ వివిధ అవసరాల కోసం, ఆర్థిక లావాదేవీల కోసం పలు గుర్తింపు పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, పాన్ ల వంటివి. ఇవన్నీ ఒకే డిజిటల్ ఐడెంటిటీ గా మారితే ..! అప్పుడు ఏ కార్డు అవసరమైతే ఆ కార్డును అప్పటికప్పుడే వాడుకోవడానికి వీలుంటుంది. ఈ దిశగానే కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
డిజిటల్ గుర్తింపు పత్రాల సమాకలనం (ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్)గా ఈ కొత్త మోడల్‌ను రూపొందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఓ ప్రతిపాదన తయారు చేస్తున్నది ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్ట్, పాన్.. ఇలాంటి గుర్తింపు పత్రాలన్నింటినీ (ఐడి లను) అనుసంధానం చేస్తూ కొత్తగా ‘ఒకే డిజిటల్ ఐడి’ ని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఓ వార్తా సంస్థ సమాచారం మేరకు, ప్రస్తుతం దేశ పౌరులు వివిధ అవసరాల కోసం ఆధార్, ఓటరు గుర్తింపు, పాన్ కార్డు, పాస్‌పోర్టు వంటివాటిని ప్రభుత్వ గుర్తింపు కార్డులుగా వాడుతున్నారు. వీటన్నింటి స్థానంలో ఒకే డిజిటల్ ఐడీ ఉండటం మేలని ప్రభుత్వం భావిస్తోంది. ఏ కార్డు అవసరమైతే ఆ కార్డును అప్పటికప్పుడు వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రతిపాదనను రూపొందించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఐడీల సమాచారం మొత్తాన్ని ఒకే చోట ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కేవైసీ (నో యువర్ కస్టమర్) లేదా ఈ-కేవైసీకి ఈ డిజిటల్ ఐడీని వినియోగించుకోవచ్చు. కేంద్రం కొత్త ప్రతిపాదనలో భాగంగా ఆధార్ కార్డు నంబరు మాదిరిగా దీనికీ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్య ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దీన్ని త్వరలోనే ప్రజాభిప్రాయానికి కేంద్ర ఐటీ శాఖ అందుబాటులో ఉంచుతుందని సమాచారం. పూర్తి అధ్యయనం, రక్షణ చర్యలు తీసుకున్న తర్వాతే ఈ ఐడి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.