పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మన్ కు లెప్టోస్పైరోసిస్ ఇన్ఫెక్షన్ సోకినట్లు శనివారం నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రొటీన్ చెకప్ కోసం బుధవారం ఆసుపత్రిలో చేరిన ఆయనకు, వైద్య పరీక్షలు నిర్వహించగా, లెప్టోస్పిరోసిస్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకినట్లు తేలింది.
లెప్టోస్పైరోసిస్ ఇన్ఫెక్షన్ బారిన పడిన ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మన్ కు యాంటీబయాటిక్స్ తో చికిత్స ప్రారంభించామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన గణనీయంగా కోలుకున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఫోర్టిస్ ఆసుపత్రి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ ఆర్కే జస్వాల్ తెలిపారు.
కాగా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మన్ కు ప్రమాదకర ఇన్ఫెక్షన్ సోకడంపై రాష్ట్రంలోని విపక్ష నేతలు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత చరణ్జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ ఒక సీఎం తన ఆరోగ్యం తాను చూసుకోలేకపోతే, పంజాబ్ ను ఎలా చూసుకుంటారని ప్రశ్నించారు.
లెప్టోస్పిరోసిస్ అనేది ప్రాథమికంగా ఒక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది కలుషితమైన నీరు, మట్టి, మూత్రం లేదా ఇతర శారీరక ద్రవాల ద్వారా మానవులు, జంతువులలో వ్యాపిస్తుంది. లెప్టోస్పైరా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఈ వ్యాధి వలన మూత్రపిండాలు దెబ్బతినడం, మెనింజైటిస్, కాలేయ వైఫల్యం, శ్వాసకోశ సమస్య మొదలైన అనారోగ్యాలు తలెత్తుతాయి.
సరైన చికిత్స లభించకపోతే మరణానికి కూడా కారణమవుతుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. ప్రతి సంవత్సరం సుమారు 1 మిలియన్ లెప్టోస్పిరోసిస్ కేసులు నమోదవుతాయని, వాటిలో 60,000 మరణాలు సంభవిస్తాయని తెలిపింది.