ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త జిల్లాలకు సంబంధించి ఆందోళనలు మరింత తీవ్రతరమవుతున్నాయి. ముఖ్యంగా సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాతో పాటు, ఆ పార్టీకి తిరుగులేని ఆధిక్యత ఉన్న రాయలసీమ జిల్లాల్లో చిచ్చు రేపుతున్నది. అధికార పార్టీకి చెందిన నేతలే పలుచోట్ల ఆందోళనలు చేస్తున్నారు.
కడపను విడదీసి రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రకటించడాన్ని ఇక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అన్నమయ్య జిల్లాకు రాజంపేటను కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఈ డిమాండ్‌పై అధికార పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
దీనిలో భాగంగా వైసీపీకి ఆవిర్భావం నుంచి కంచుకోటల్లా ఉన్న ప్రధాన గ్రామాల్లో ‘వైసీపీకి ఇక సెలవు’ అంటూ హైవేలపై హోర్డింగ్‌లు పెట్టారు. అదేవిధంగా గత ఎన్నికల్లో వైసీపీ నాయకులు భారీ మెజారిటీతో గెలుపొందిన రాజంపేట, కోడూరు నియోజకర్గాల్లో ఇక్కడి ప్రజాప్రతినిధులు కనిపించడం లేదని.. వీరి ఆచూకీ తెలియజేయాలి అని సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి.
అన్నమయ్య జన్మస్థలి, పార్లమెంట్, రెవెన్యూ డివిజన్ కేంద్రమైన రాజంపేటను జిల్లా కేంద్రం చేయకుండా కనీసం మంచినీళ్లు దొరకని రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం ఏమిటంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఇందులో భాగంగా రాజంపేటకు సమీపంలోని కడప-చెన్నై హైవే పక్కనున్న వైసీపీకి, ప్రధానంగా సీఎం జగన్ కుటుంబానికి కంచుకోటైన రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లె ముఖద్వారం వద్ద ఆ గ్రామస్థులు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.. ‘‘జిల్లాల విభజన వంచనకు నిరసనగా బరువెక్కిన హృదయాలతో వైఎస్సార్సీపీకి ఇక సెలవు. రాయచోటి వద్దు-రాజంపేట ముద్దు’’ అని ఫ్లెక్సీపై పేర్కొన్నారు.
గ్రామంలోని మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు ఫ్లెక్సీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కనబడడం లేదని, వారు ఉద్యమంలో పాల్గొనడం లేదని దుయ్యబట్టారు.
ఈ క్రమంలో వారి ఫొటోలతో ‘‘ఈ నేతలు గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు.. వీరు కనిపించక రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గ ప్రాంతాల ప్రజలు దిక్కుతోచని, అయోమయ స్థితిలో భయానక వాతావరణంలో వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు’’ అని సోషల్ మీడియాలలో పోస్టులను పెట్టారు.
మరోవంక, రాజంపేటను జిల్లా కేంద్రం చేయనందుకు నిరసనగా రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. కడప-చెన్నై హైవేపై రాజంపేట, నందలూరు సమీపంలోని చెయ్యేరు వంతెన వద్ద టీడీపీ నేతలు రోడ్డును దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు.
రాయచోటి వద్దు-రాజంపేట ముద్దు, అన్నమయ్య గడ్డను జిల్లా కేంద్రం చేయాలి, రాజంపేటను వంచించిన వైసీపీ నేతలు వెంటనే రాజీనామా చేయాలి, సీఎం ‘డౌన్.. డౌన్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో చెన్నై, కడప, కర్నూలు సహా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి రోడ్డుపై బైఠాయించిన నేతలను అక్కడ నుంచి బలవంతంగా పక్కకు తరలించారు.
అదే విధంగా అన్నమయ్య విగ్రహం ఎదుట టీడీపీ నాయకులు నినాదాలు చేశారు. జనసేన పార్టీ నాయకులు రాజంపేట ఆర్అండ్బీ బంగ్లా సమీపంలో సీఎం, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్లతో కూడిన దిష్టిబొమ్మను దహనం చేశారు. అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో రాజంపేట పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో అఖిలపక్ష నేతలు రెండో రోజు కూడా రిలే దీక్షలు చేపట్టారు.
కర్నూలులో డోన్ కోసం
కాగా, కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గం కరువు ప్రాంతమని, జిల్లాల విభజన పేరుతో ప్రజలకు అన్యాయం చేయవద్దని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. డోన్ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని స్థానిక పాతబస్టాండులో రిలే దీక్షలు చేపట్టారు.
నంద్యాల జిల్లాలోకి కలపడం వల్ల డోన్ నియోజకవర్గానికి నష్టమే తప్ప.. ఎలాంటి మేలు జరగదని విమర్శిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలను కలిపి ఆదోని జిల్లా ఏర్పాటు కోసం మరోవంక పోరాటం చేస్తామని ప్రకటించారు.
ఆదోని కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శ్రీనివాస్ భవన్ కూడలి నుండి ఆర్డీఓ కార్యాలయం వద్ద భారీ ర్యాలీ చేపట్టారు. వెనుకబడిన ప్రాంతం ఆదోని డివిజన్ అని… జిల్లా కేంద్రంగా చేస్తేనే అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఆదోని కేంద్రంగా మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు ఐదు నియోజకవర్గాలు కలిపి జిల్లా ఏర్పాటు చేయలని డిమాండ్ చేశారు. ఆదోని జిల్లా కేంద్రంగా గుర్తించాలని అఖిలపక్షం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ర్యాలీలో పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.
హిందూపురం జిల్లా కోసం
ఇక,అనంతపురం జిల్లాను విడదీసి పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటు చేయనున్న శ్రీసత్యసాయి జిల్లాకు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వైసీపీయేతర అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంల అఖిలపక్ష నేతలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు.
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ఎన్టీఆర్, వైఎస్సార్‌తోపాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు హామీ ఇచ్చారని తెలిపారు. సీఎం జగన్ మాత్రం దీనికి భిన్నంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
‘ప్రభుత్వానికి మా గోడు వినపడలేదు. మహాత్మా.. మీరైనా న్యాయం చేయండి’ అని కోరుతూ గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు అధికార పార్టీ నేతల్లో సహితం చిచ్చు రేపుతోంది.
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్ పట్టుపడుతున్నారు. జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి ఎమ్మెల్సీ ఇక్బాల్, మున్సిపల్ కౌన్సిలర్లు వినతి పత్రం సమర్పించారు. ఇప్పటికే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేశారు. పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేసినట్లయితే విదేశాల నుంచి వచ్చే వారికి అసౌకర్యంగా ఉంటుందని తెలిపారు. పుట్టపర్తివాసుల్లో ఇప్పటికీ వరదల భయం కూడా వెంటాడుతోందని ఆయన పేర్కొన్నారు.
నగరిని బాలాజీ జిల్లాలో కలపాలి
నగరి మండలాన్ని బాలాజీ జిల్లాలో చేర్చాలని కోరుతూ సోమవారం జరిగిన మున్సిపల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. నియోజక వర్గం పూర్తిగా తుడ పరిధిలో ఉన్నందున పరిపాలనా సౌకర్యం, అభవృద్ధి కోసం బాలాజీ జిల్లాలో చేర్చాలని సభ్యులు పేర్కొన్నారు. అలాగే బాలాజీ జిల్లా పేరిట క్రయవిక్రయాల రిజి స్ట్రేషన్లు జరుగుతున్నాయని, తిరుపతికి ప్రతి పది నిముషాలకు ఓ బస్సు, రోజుకు నాలుగు రైళ్లు సౌకర్యం వున్నాయని సభ్యులు తెలిపారు.
చిత్తూరుకు అయితే ఇలాంటి రాకపోకల సౌకర్యం లేదని వివరిం చారు. ఈ తీర్మానాన్ని వైస్‌చైర్మన్ వెంకటరత్నం రెడ్డి, కౌన్సిలర్లు గోపాల్‌రెడ్డి, దయానిధి, ఇంద్రయ్యలు ప్రవేశపెట్టారు.
నగరి నియోజక వర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని నగరి అంబేడ్కర్ సర్కిల్ వద్ద అంబేడ్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో సోమవారం దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలు రిజర్వుడు కావడంతో చిత్తూరు జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాబు మాట్లాడుతూ కూతవేటు దూరంలో ఉన్న తిరుపతిని కాదని చిత్తూరులో ఎలా చేర్చుతారని ప్రశ్నించారు.
బ్రాహ్మణపట్టు గ్రామ పొలిమేర్లలోనే తిరుచానూరు ఉండగా అక్కడి ప్రజలు చిత్తూరుకు ఎలా వెళతారని ప్రశ్నించారు. తుడ పరిధికి పుత్తూరు, నగరి కావాలి జిల్లా పరిధికి మాత్రం వద్దా అని ఎద్దేవా చేశారు. అవగాహన లేకుండా చేసిన ఈ పొరబాటును సరిదిద్దక పోతే అఖిలపక్షంతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.