తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ జరగకముందే కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుందని పేర్కొంది. ఈ సందర్భంగా ఇరువాదనలు విన్న కోర్టు కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరం పెట్టాలని సూచించింది. దాదాపు గంటపాటు సాగిన వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఏపీ ప్రభుత్వం చేసిన ఆరోపణల మేరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నాయకుడు , న్యాయవాది సుబ్రహ్మణ్యస్వామితో సహ పలువురు న్యాయవాదులు సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్లపై సోమవారం విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.
లడ్డూలో నాణ్యత లోపం ఉందని భక్తులు ఫిర్యాదు చేయడంతో టీటీడీ అధికారులు తనిఖీలు నిర్వహించి నెయ్యిని సరఫరా చేస్తున్న ఏఆర్ ఫుడ్స్ ట్యాంకర్లను పరిశీలించి టెస్టింగ్కు పంపించారని వివరించారు. అక్కడి నుంచి వచ్చిన రిపోర్టు ఆధారంగా కల్తీ జరిగిందని గుర్తించారని తెలిపారు. స్పందించిన ధర్మాసనం ఏదైనా అనుమానం ఉన్నప్పుడు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
నెయ్యి కల్తీ జరిగినట్టు గుర్తించిన తర్వాత , తయారైన లడ్డూలను టెస్టింగుకు పంపారా? లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. మైసూర్, గజియాబాద్ ల్యాబ్ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదుని, నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని ఆదేశించారు.
కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని సుప్రీంకోర్ట్ నిలదీసింది. ఈ అంశంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించిన అనంతరం కల్తీ నెయ్యిపై మీడియా ముందు ప్రకటన చేయడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నియమించిన సిట్ సరిగ్గా విచారణ జరపగలదా? అన్న సందేహాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది.