తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణ దరిమిలా సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఏపీ డీజపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరుఫున వాదిస్తున్న రాష్ట్ర లాయర్ల సూచన మేరకు విచారణను నిలిపివేశామని పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తదుపరి సిట్ దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు. తిరుమలలో ఈనెల 4 నుంచి 12వ తేదీవరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలుకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. మంగళవారం తిరుమలలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తిరుమలలో దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంటుందని పేర్కొన్నారు.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అందుబాగులో 2 వేలకు పైగా సీసీ కెమెరాలను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తామన్నారు.
తిరుమాడ వీధుల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.. ప్రయాణిలకు భద్రత ప్రథమ ప్రాధాన్యం కింద తీసుకుని ఆర్టీసీలో ప్రయాణం భద్రత ఉంటుందని అవగాహన కల్పిస్తున్నామన్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా అంతకుముందు వచ్చే మంగళవారం రోజున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని గోడలు, పైకప్పులు, స్తంభాలు అన్నింటిలోనూ పరిమళం అనే ప్రత్యేక సుగంధ మిశ్రమాన్ని పూయగా మొత్తం ఆలయం, దేవతా మూర్తులు, పూజా సామగ్రిని శుభ్రం చేశారు.
అనంతరం టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ అక్టోబరు 4 నుంచి 12 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఈ విశిష్ట తిరుమంజనం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు . సాధారణంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సంవత్సరానికి నాలుగుసార్లు నిర్వహిస్తామని తెలిపారు. తెలుగు ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు , వైకుంఠ ఏకాదశి ఉత్సవాల ముందు సంవత్సరం ముందు మంగళవారం వీటిని నిర్వహిస్తమన్నారు.
అనంతరం పీఠాధిపతికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం దృష్ట్యా మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, వీఐపీ బ్రేక్‌ను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, అధికారులు పాల్గొన్నారు.