కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెడుతున్న సందర్భంగా వచ్చే సంవత్సరం నుంచే డిజిటల్ రుపీని ప్రవేశ పెడుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో దీని పట్ల ప్రజలలో ఆసక్తి కలుగుతున్నది. రిజర్వు బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సిబిసిడి)ని డిజిటల్ రూపీ రూపంలో పరిచయం చేయనున్నట్లు ఆమె తెలిపారు.
రాబోయే ఆర్థిక సంవత్సరం నుండి సిబిసిడిని రిజర్వ్ బ్యాంక్ తీసుకురానుంది. ఇది బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఆ విధంగా కేంద్రం ప్రణాళికలు చేస్తోంది. సిబిసిడి అనేది డిజిటల్ రూపంలో సెంట్రల్ బ్యాంక్ జారీ చేసే చట్టపరమైన టెండర్.
ఇది కాగితంలో జారీ చేసే ఫియట్ కరెన్సీ విలువతో సమానంగా ఉంటుంది. ఏదైనా ఇతర ఫియట్ కరెన్సీతో పరస్పరం మార్చుకోవచ్చు. వినియోగదారులకు డిజిటల్ సౌలభ్యం, భద్రతతో పాటు సాంప్రదాయ బ్యాకింగ్ వ్యవస్థ నియంత్రణ సదుపాయాలను కల్పించడం.
బడ్జెట్లో డిజిటల్ రూపీ ప్రస్తావన తీసుకు రావడం ద్వారా ఈ మధ్య కాలంలో వివాదాస్పదంగా మారిన క్రిప్టో కరెన్సీలు, ఇతర వర్చువల్ కరెన్సీలపై కేంద్ర ప్రభుత్వం తన స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసిన్నట్లు అయింది. బిట్ కాయిన్, ఈథర్ వంటి ప్రైవేటు కరెన్సీలతో మనీలాండరింగ్, ఉగ్ర చర్యలకు ఆర్థిక సాయం, పన్ను ఎగవేత వంటివి ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయని ఆర్బిఐ అనేక సార్లు ఆందోళన వ్యక్తం చేసింది.
అందుకే ప్రభుత్వ హయంలో నడిచేలా ఈ సిబిసిడి ప్రణాళికను రూపొందించింది. డిజిటల్ రూపాయిని ఎలా వినియోగించాలనే అంశంపై సాంకేతిక నిపుణులు, ఆర్థిక నిపుణులు అనేక విధానాలను చెబుతున్నారు. అయితే ఆర్బిఐ చేయబోయే అధికారిక ప్రకటన మాత్రమే..ఎలా లావాదేవీలు జరపాలో.. దేనికి వర్తిస్తుందో చెబుతుంది. అయితే ఇప్పుడున్న డిజిటల్ చెల్లింపుల కన్నా … డిజిల్ రూపాయి లావాదేవీలు త్వరగా జరుగుతాయని తెలుస్తోంది.