సమ్మెకు సిద్దమైన ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు రమ్మనమని పదే పదే కబుర్లు పంపి, మరోమారు వారిని చర్చలకు తీసుకొచ్చిన ఏపీ మంత్రుల కమిటీ చివరకు వారు లేవనెత్తిన డిమాండ్లపై నోరు మెదపకుండా, వాటిని పరిష్కరించడం సాధ్యం కాదని చేతులెత్తేయడం పట్ల ఉద్యోగులు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు.
చర్చల పేరుతో కాలయాపన చేస్తూ తమను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు
మంత్రుల కమిటీతో భేటీ తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా భేటీలో మళ్లీ మోస మే జరిగిందని, తమ డిమాండ్లను అంగీకరించలేదని చెబుతూ గురువారం ‘చలో విజయవాడ’కు లక్షలాదిగా తరలి రావాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
‘‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ అధికారులు కొన్ని పేస్లిప్లు చూపి సమాజాన్ని భ్రమింపచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పేస్లి్పకు కొత్త ఫార్మాట్‌ను ఎందుకు డిజైన్ చేశారు? పేస్లి్పలో జీతం పడినట్లు చెప్పారు. కానీ బ్యాంకుల్లో డబ్బు జమ కాలేదే? మెసేజ్ వచ్చిన ఏ ఉద్యోగికీ ఖాతాలో జీతం పడలేదు” అంటూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టీరింగ్ కమిటీ సమావేశం ముగించుకుని తాము వెళ్తున్న సమయంలో మూడు డిమాండ్ల అసంబద్దమని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్లో చెప్పడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు ఈ పేస్లి్పలు చూసి తాం మతి భ్రమించలేదని స్పష్టం చేశారు. బుధవారం పేస్లి్పలను ఎవరి ఆఫీసుల ముం దు వారు తగలబెట్టండి అంటూ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
చర్చల సందర్భంగా కమిటీపై ప్రశ్నలవర్షం కురిపించామని వారు తెలిపారు. ‘‘డీఏలు పెండింగ్ పెట్టినా, కరోనా రిలీఫ్ కోసం ఒక్క రోజు జీతాలివ్వాలని కోరినా అంగీకరించాం. అయినా మా ఉద్యోగుల సమస్యల ను ఏనాడైనా పట్టించుకున్నారా? 4 ఉద్యోగ సంఘాలతో నాలుగు స్తంభాలాట ఆడుకున్నారు. నలుగురం ఏకమై వస్తే అవమానించారు” అంటూ కడిగివేసామని వెల్లడించారు.
సీఎం స్థాయిలో ఫిట్మెంట్ అం శాన్ని చర్చించి మిగిలిన అంశాలను కింది స్థాయిలో చర్చించుకోమన్న విషయం వాస్తవం కాదా? పాత జీతాలే చెల్లించాలని కోరితే పట్టించుకున్నారా? అంటూ మంత్రులను నిలదీశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే పీఆర్సీ నివేదికను బయటపెట్టలేదని మండిపడ్డారు.
ఉద్యోగులకు ఏ స్కేల్ ఇచ్చారో ఆ నివేదిక చూడకపోతే ఎలా తెలుస్తుంది? ఆర్టీసీ ఉద్యోగులకు ఏ స్కేల్ ఇచ్చారన్న విషయం నివేదిక ఇవ్వకపోతే ఎలా తెలుస్తుంది? మేం అడిగిన పే స్కేల్‌ను అశుతోష్ మిశ్రా కమిటీ ఆమోదించి ఉంటుంది. అది వెల్లడి చేస్తే చెల్లించాల్సి వస్తుందని దాచిపెడుతోందని వారు దుయ్యబట్టారు. పర్యటించి, అనేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించిన కష్టం వృధా అయినట్లే కదా? అంటూ ప్రభుత్వాన్ని వారు నిలదీశారు. !.
పాత డీఏల బకాయిలు కలిపి జీతాలు పెరిగాయని చెప్పి మోసం చేస్తారా? అంటూ నేతలు మండిపడ్డారు. మార్చి 22లోపు జీతాల ప్రక్రియ పూర్తి చేయాలని సర్క్యులర్ ఇచ్చి ఆ తరువాత రాత్రికి రాత్రే ప్రక్రియ పూర్తి చేయాలని, లేనిపక్షంలో అధికారులపై చర్యలు తీసుకుంటామని మరో సర్క్యులర్ ఇవ్వడం సర్వీసు నిబంధనలకు వ్యతిరేకమని వారు స్పష్టం చేశారు.
తాము చర్చలకు రావడం లేదని మంత్రుల కమిటీ తప్పుడు ప్రచారం చేస్తోందని, పైగా తప్పుడు లెక్కలు వేసి జీతాలు పెరిగాయని ఐఎఎస్ అధికారులే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పే స్లిప్పులను సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న తప్పుడు ప్రచారంపైనా ఉద్యోగులు తగురీతిలో స్పందించాలని సూచించారు.
సమ్మెలోకి వెళ్లవద్దని కలెక్టర్లు సిబ్బందికి క్లాసులు చెబుతున్నారని, అటువంటి పద్ధతులకు స్వస్తి పలకాలని హెచ్చరించారు. ఒకవేళ ఉద్యోగులను చైతన్యం చేయాలనుకుంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని వారు సూచించారు. జీతాలకు కోత పెట్టే పిఆర్సిని ఆమోదిస్తే చారిత్రక తప్పిదం చేసినట్లేనని వారు స్పష్టం చేశారు.
ఈ తప్పిదాన్ని భవిష్యత్ తరాలకు చేరకూడదనే ఉద్దేశంతో తాము కార్యాచరణ చేపడుతున్నామని నేతలు వెల్లడించాయిరు. నిజాయితీగా ఉద్యమం చేస్తున్నామని దీనిలో ఎటువంటి అనుమానాలకు తావులేదని తెలిపారు.