మార్చ్ 2న కోర్ట్ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముంబై మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇటీవల మమతా ముంబై వచ్చిన సమయంలో జాతీయ గీతాన్ని అవమానపరిచారనే ఆరోపణలపై దాఖలైన కేసులో ఈ ఆదేశాలు జారీచేసింది.
డిసెంబరు 1, 2021న ముంబైలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి సీఎం మమతా బెనర్జీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ఈ కార్యక్రమంలో మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని అవమానించారని మహారాష్ట్రకు చెందిన బీజేపీ కార్యకర్త, న్యాయవాది వివేకానంద గుప్తా ఆరోపించారు. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మెజిస్ట్రేట్ కోర్టును కోరారు.
ముంబైలో ఈ కార్యక్రమానికి హాజరైన బెనర్జీ జాతీయ గీతంలోని మొదటి రెండు పద్యాలను కూర్చొని ఆలపించారని, ఆ తర్వాత నిలబడి మరో రెండు శ్లోకాలు పఠించారని, ఆ తర్వాత అకస్మాత్తుగా ఆగిపోయారని కోర్టుకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని ఆలపించి, ఆ తర్వాత వేదికపై నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదుదారుడి వాంగ్మూలం, వీడియో క్లిప్,యూట్యూబ్‌లోని వీడియోల ద్వారా ప్రాథమికంగా స్పష్టంగా తెలుస్తోందని కోర్టు పేర్కొంది. జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971లోని సెక్షన్ 3 ప్రకారం మమతా శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డాడని ఈ ప్రాథమిక విచారణ రుజువు చేస్తుందని తెలిపింది.