పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, అరెస్ట్ లు జరిపినా, ప్రభుత్వం ఎంతగా బెదిరించినా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఖాతరు చేయలేదు. అకస్మాత్తుగా ఉప్పెనవలె, నిముషాలలో వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయములు `చలో విజయవాడ’ కార్యక్రమం ప్రారంభించడం, ఉప్పనివలె విజృభించడంతో పోలీస్ యంత్రంగం నివ్వెరపోయింది. తామిక ఏమీచేయలేమని గ్రహించి చేతులెత్తేసింది.
విజయవాడ రహదారులన్నీ ఉద్యోగులతో నిండిపోయాయి. ఎక్కడికక్కడ బారికేడ్లను ఛేదించుకొని ఉద్యోగులు ముందుకు దూసుకెళ్లారు. వందలాది మందిని అరెస్ట్ చేసినా, ఇళ్లకు వెళ్లి బెదిరించినా, బస్సులు, రైళ్లు, కార్లలో తనిఖీలు జరిపినా ప్రయోజనం లేకపోయింది.
“కరోనానే ఖతం చేశాం..మీ నిర్బంధాలు ఒక లెక్కా” అంటూ వేలసంఖ్యలో ఉద్యోగులు యెట్లా చేరుకున్నారని పోలీసులు ఖంగుతిన్నారు. వేలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాదయాత్ర జరుపుతూ “మాకు న్యాయం కావాలి” అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దుచేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ జీవో రద్దు చేయాలని ముద్రించిన మాస్కులను ధరించారు. ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం లేదంటూ నినాదాలు చేశారు. తీవ్రవాదుల కంటే దారుణంగా తమ పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్నారని అంటూ తీవ్రంగా ఖండించారు. “నేను ఉన్నాను… నేను విన్నానని ప్రతిపక్ష నేతగా అన్న జగన్
ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమవడం దారుణం” అంటూ ఉద్యోగులు మండిపడ్డారు. అణచివేత కొనసాగితే ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు వెనుకాడం అంటూ హెచ్చరించారు.
సీఎం పట్టుదలకు వెళ్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేస్తూ
“మేం ఏపీలో ఉన్నాం… పాకిస్థాన్లో కాదు… అణచివేత తగదు” అంటూ ప్రభుత్వంకు హితవు చెప్పారు. ఎన్జీవో భవన్ నుంచి అలంకార్ థియేటర్ కూడలి మీదుగా బీఆర్టీఎస్ రోడ్డు వైపు ర్యాలీగా ముందుకు సాగారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ తమది బల ప్రదర్శన కాదని.. ఉద్యోగుల వేదనే ‘ఛలో విజయవాడ’ అని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. అడ్డంకులు ఎన్ని ఉన్నా ఉద్యోగులు తరలి వచ్చారని చెప్పారు. ఈ నెల 5 నుంచి పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తామని, 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తు న్నట్లు బప్పరాజు తేల్చి చెప్పారు.
డిమాండ్లు నెరవేర్చే వరకూ తమ ఉద్యమం ఆగబోదని హెచ్చరించారు. ప్రభుత్వం అన్నీ దొంగ లెక్కలు చెబుతోందని ఆరోపించారు.
”ప్రభుత్వం ఇలాంటి పీఆర్సీని ప్రకటించడం ఒక చరిత్ర.. ఉద్యోగుల ఉద్యమం కూడా ఒక చరిత్రే. ఈనెల 5 నుంచి సహాయ నిరాకరణ చేపడతాం. ఉద్యోగుల సమ్మెతో ప్రజలకు అసౌకర్యం కలిగితే ఆ భాధ్యత ప్రభుత్వానిదే” అని ప్రకటించారు.
ఉద్యోగుల ఉద్యమమంటే ఏంటో ఈ ప్రభుత్వానికి తెలియాలని పిలుపిచ్చారు. ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలని చెప్పారు. ‘చలో విజయవాడ’కు భారీగా ఉద్యోగులు తరలి వచ్చారని. ఇప్పటికైనా తమ ఆందోళనలను ప్రభుత్వం గుర్తించాలని పీఆర్సీ సాధన సమితి నేత వెంట్రామిరెడ్డి కోరారు. సీపీఎస్ రద్దు చేయాలని.. పొరుగు సేవల సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒప్పంద ఉద్యోగుల సర్వీసులు క్రమబద్ధీకరించాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వాధినేతగా సీఎం జగన్ ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించాలని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పీఆర్సీ అంశంలో జగన్ నేరుగా ఉద్యోగులతో చర్చించి న్యాయం చేయాలని కోరారు. తాము శాంతియుతంగా అందోళనలు చేస్తున్నామని .. సీఎం జోక్యం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఒప్పంద , పొరుగు సేవల సిబ్బంది వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
పోలీస్ వైఫల్యం … జగన్ ఆగ్రహం
కాగా, ఉద్యోగులు 15 రోజుల ముందే తమ కార్యక్రమం ప్రకటించినా వారిని విజయవాడ రాకుండా కట్టడి చేయలేక పోయారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తున్నది. విజయవాడకు భారీగా ఉద్యోగులు తరలి రావడంతో పోలీసుల వైఫల్యమే కారణమని జగన్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.
ఎన్ని నిర్బంధాలు పెట్టినప్పటికీ, ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు విజయవాడ చేరుకొని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బల ప్రదర్శన చేయడం నిఘా వైఫల్యంగా కూడా పరిగణిస్తున్నారు. జగన్తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామాకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమావేశమై ఉద్యోగుల ప్రదర్శన విజయవంతంగా జరగడంపై సమీక్ష జరిపారు.
ఉద్యోగుల నిరసనలపై జగన్ ప్రభుత్వ తీరు దుర్మార్గమని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నియంతృత్వం వీడి రివర్స్ పీఆర్సీని వెనక్కి తీసుకోవాలని, అహంకారంతో కాకుండా ఆలోచనతో స్పందించాలని ప్రభుత్వకు హితవు చెప్పారు.