బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ శుక్రవారం నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గనేందుకు 90 దేశాల నుంచి సుమారు 2,900మంది అథ్లెట్లు ప్రాతినిధ్యం వహించనున్నారు. అత్యధిక అథ్లెట్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వింటర్ ఒలింపిక్స్‌గా బీజింగ్ చరిత్రలో నిలిచిపోనుంది.
కాగా, బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు ఉత్సవాలకు దూరంగా ఉండాలని భారత్ నిర్ణయించింది. దీనికి ప్రధాన కారణం పిఎల్ఏ గల్వాన్ కమాండర్‌ను వింటర్ ఒలింపిక్స్ టార్చ్ బేరర్ నిర్ణయించడమేనని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
భారత్‌తో గాల్వాన్ వ్యాలీ ఘర్షణల్లో గాయపడిన చైఆన ఆర్మీ అధికారిని చైనా బుధవారం టార్చ్ బేరర్‌గా నిర్ణయించి ఆయనను ఘనంగా సత్కరించినట్లు చైనా మీడియా తెలిపింది. గాల్వాన్‌లో ఘర్షణ వాతావరణం కారణంగా భారత సైనికులు 20మంది చనిపోయారని, చైనా నలుగురు సైనికులను మాత్రమే కోల్పోయిందని మంత్రిత్వశాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.
మరోవంక, చైనాలో మానవహక్కుల ఉల్లంఘనకు నిరసనగా అమెరికా, బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ లతో పాటు పలు ప్రజాస్వామ్య దేశాలు బీజింగ్ ఒలింపిక్స్ లను దౌత్య బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించాయి. దానితో చైనాకు బాసటగా ఉంటున్నట్లు చాటటం కోసమైనా రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ప్రారంభ సంబరాలలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు.
ఈ పరిణామాలు ఈ క్రీడలపై అంతర్జాతీయ రాజకీయ నీడలు పడినట్లు స్పష్టం అవుతున్నది. అసలు ఈ దేశంలో ఈ క్రీడలను నిర్వహించరాదని అంటూ టిబెట్ ఉద్యమకారులతో పాటు పలు మానవహక్కుల ఉద్యమకారులు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీపై వత్తిడి తీసుకొచ్చిన ప్రయోజనం లేకపోయింది.
మంచు ప్రాంతంలో ఈ క్రీడలు జరగనున్న దృష్ట్యా పోటీల్లో పాల్గనేవారు కూడా ఎక్కుమంది యువ అథ్లెట్లే కావడం విశేషం. అలాగే మహిళల క్రీడాంశాల సంఖ్య కూడా బాగా పెరిగాయి. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో జరిగే క్రీడాంశాల్లో 52.75శాతం పురుషుల, 47.25శాతం మహిళల పోటీలు ఉన్నాయి.
ఫ్రాన్స్ వేదికగా 1924లో ప్రారంభమైన తొలి వింటర్ ఒలింపిక్స్‌లో కేవలం 2 క్రీడాంశాలు మాత్రమే నిర్వహించారు. ఆ పోటీల్లో అసలు మహిళా అథ్లెట్లు ప్రాతినిధ్యం వహించలేదు. 1980నుంచి మహిళా క్రీడాంశాలు వింటర్ ఒలింపిక్స్‌లో జత కలిసాయి. ఆ పోటీల్లో తొలిసారి 12శాతం మహిళా అథ్లెట్లు పాల్గన్నారు.
ఇక వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గనే ప్రతి ఒక్క అథ్లెట్ రెండు డోసులు వేయించుకున్న వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంది. బహిరంగ ప్రదేశాల్లో అథ్లెట్లు స్థానికులు కరచాలనం, ప్రత్యక్ష సంబరాల్లో పాల్గనేందుకు వీలులేదు. కరోనా నేపథ్యంలో అథ్లెట్ల సంరక్షణకు తొలి ప్రాధాన్యతనిచ్చినట్లు బీజింగ్ ఒలింపిక్స్ నిర్వాహకులు గైడ్‌లైన్స్ విడుదల చేశారు.
పోటీలు జరిగే ఆరు మైదానాలను శుచిగా, శుభ్రంగా ఉంచామని, ప్రారంభ, ముగింపు ఉత్సవాల కోసం వాటర్ క్యూబ్లనూ సిద్ధం చేసినట్లు తెలిపారు. వింటర్ ఒలింపిక్స్‌ను విజయంతం చేసేందుకు 346 మిలియన్ల చైనా ప్రజలు శ్రమించారని, 2015లో చైనాకు వింటర్ ఒలింపిక్స్ బిడ్ దక్కినప్పటినుంచి చైనా ఆర్థిక బడ్జెట్లో 317 శాతంమేర ఆరు స్టేడియాల నిర్మాణం కోసం వినియోగించింది.