ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తున్న ఎంఐఎం పార్టీ అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు కలకలం రేపడంతో వెంటనే కేంద్ర హోంశాఖ స్పందిస్తూ ఆయనకు సీఆర్పిఎఫ్ జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. తక్షణమే సెక్యూరిటీ భద్రత అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు.
అయితే, ఒవైసీ శుక్రవారం లోక్‌సభలో మాట్లాడుతూ.. జెడ్-కేటగిరీ భద్రత తనకు అక్కర్లేదని తిరస్కరించారు. ‘‘ఎవరు వారిని మొబిలైజ్ చేస్తున్నారు అనేది నా ప్రశ్న. దాడి చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? పరిస్థితిని సమీక్షించడానికి నేను దీనిని ప్రభుత్వానికి వదిలివేస్తున్నాను’’ అని ఒవైసీ లోక్ సభలో చెప్పారు.
ఇటీవల హరిద్వార్, రాయ్‌పూర్, ప్రయాగ్‌రాజ్‌లలో నిర్వహించిన ధర్మ సంసద్లలో తనకు వ్యతిరేకంగా చేసిన ‘ప్రేరేపిత ప్రసంగాలను’ పరిశీలించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
“నాకు జెడ్ కేటగిరీ భద్రత వద్దు. నేను స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నా, ఊపిరాడకుండా ఉండాలని నేను అనుకోవడం లేదు. అట్లాంటి పరిస్థితిని ఎప్పటికీ కోరుకోను. మత విద్వేషాన్ని అంతం చేయండి” అని కోరుతూనే.. పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ భద్రతలో లోపం జరిగినప్పుడు కూడా తాను ఖండించానని.. ఇలా ఎవరికీ జరగకూడదన్నదే తన అభిప్రాయమని పేర్కొన్నారు.
తన కారుపై కాల్పుల ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, నిందితులపై టెర్రర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. సామాన్య ప్రజలకు భద్రత కల్పించినప్పుడే తనకూ భద్రత కావాలని పార్లమెంట్లో చెప్పారు.