ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. తనకు కోటిన్నర విలువ చేసే ఆస్తులు ఉన్నట్టు ఈ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, తన దగ్గర రివాల్వర్, రైఫిల్‌తో పాటు స్మార్ట్‌ఫోన్ ఉన్నట్టు వెల్లడించారు.
యోగి ఆదిత్యనాథ్ తన ఎన్నికల అఫిడవిట్లో రూ.1,54,94,054 ఆస్తులను ప్రకటించారు. ఇందులో చేతిలో నగదు, ఆరు బ్యాంకు ఖాతాల బ్యాలెన్స్, సేవింగ్స్ ఉన్నాయి. తన వద్ద రూ. 12,000 విలువైన సామ్సంగ్ మొబైల్ ఫోన్, రూ. 1,00,000 విలువైన రివాల్వర్, రూ. 80,000 విలువైన రైఫిల్ ఉన్నట్లు తెలిపారు.
తన పేరు మీద వ్యవసాయ, వ్యవసాయేతర భూములు లేవన్నారు. అలాగే సొంత వాహనం కూడా లేదని వెల్లడించారు. యోగి ఆదిత్యనాథ్ వద్ద రూ.49,000 విలువైన 20 గ్రాముల బంగారు చెవి రింగు, రూ.20,000 విలువైన 10 గ్రాముల బంగారు గొలుసు, రుద్రాక్ష హారం ఉన్నాయి.
తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని ఎన్నికల అఫిడవిట్లో యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 13,20,653 ఆదాయం, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 15,68,799 ఆదాయం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 18,27,639 ఆదాయం, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 14,38,670 ఆదాయాన్ని ఆయన ప్రకటించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కీలక నేతల సమక్షంలో ఆయన నామినేషన్ వేశారు. గతంలో ఐదుసార్లు గోరఖపూర్ నుండి లోక్‌సభ ఎంపీగా పని చేసిన యోగి.. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మొట్టమొదటిసారి గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
నామినేషన్ దాఖలు చేసే ముందు గోరఖ్‌నాథ్ దేవాలయంలో పూజల్లో పాల్గొన్నారు. ఎలక్షన్ ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో మంత్రి అమిత షా ర్యాలీ నిర్వహించారు. ‘ఉత్తర ప్రదేశ్‌లో ముఠాలను యోగి తుడిచిపెట్టారని గర్వంగా చెప్తున్నా. పాతికేళ్ల తర్వాత యూపీలో న్యాయబద్ధంగా పాలన నడుస్తోంది. యోగి నాయకత్వంలో యూపీ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది ’ అని అమిత్ షా ఈ సందర్భంగా తెలిపారు.