ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో భారతీయ జనసంఘ్ లో తొలి శాసనసభ్యుడిగా, దక్షిణాదిన బిజెపికి తొలి ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టించిన చందుపట్ల జంగారెడ్డి (83) శనివారం కన్నుమూశారు. జంగన్నగా పార్టీ కార్యకర్తలకు, ప్రజానీకానికి చేరువైన ఆయన క్షేత్రస్థాయిలో మంచి పట్టు గల కొద్దిమంది బిజెపి నేతలలో ఒకరుగా పేరొందారు.
తెలుగు రాష్ట్రాలలో జనసంఘ్ తొలితరం నేతలలో ఒకరైన ఆయన 1967లో ఆ పార్టీ నుండి శాసనసభకు ఎన్నికైన ముగ్గుర్లో ఒకరు కాగా, తెలంగాణలో ఏకైక అభ్యర్థి. ఆ తర్వాత 1978 వరకు బిజెపికి రాష్ట్రంలో శాసనసభ్యులు లేరు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి హైదరాబాద్లో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన చందుపట్ల జంగారెడ్డి 18 నవంబర్ 1935 న జన్మించారు. ఆయన 1953లో సి.సుధేష్ణను వివాహం చేసుకున్నారు. ఆయన మూడు సార్లు ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభకు, ఒక సారి లోక్ సభకు ఎన్నికయ్యారు.
వయస్సు మీరుతున్న లెక్కచేయకుండా పార్టీ కార్యకలాపాల పట్ల ఆసక్తి చూపుతూ వచ్చిన ఆయన సైద్ధాంతికంగా జనసంఘ్ రోజుల నుండి తెలుగు రాష్ట్రాలలో క్షేత్రస్థాయి నుండి పనిచేసిన కొద్దిమందిలో ఒకరు. ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి, జనసంఘ్ ద్వారా పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు అయ్యారు.
పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అక్కడకు చేరుకొనే ఆయన ప్రజా సమస్యల పట్ల అవిశ్రాంతంగా పోరాటాలు చేస్తుండేవారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల నుండి నిజాయతి, సైద్ధాంతిక నిబద్దతతో మన్ననలు పొందుతూ ఉండేవారు. ముక్కుసూటిగా తన వాదనలను వినిపించడంలో, పార్టీ కార్యకర్తలు ఎవ్వరు ఆపదలో ఉన్నప్పటికీ వెంటనే స్పందించడంలో ఆయన ముందుండేవారు.
1967 లో మొదటిసారిగా పరకాల ఎం.ఎల్.ఏ గా జనసంఘ్ నుంచి గెలుపొందినారు. తరువాత 1972 లో అదే నియోజకవర్గం నుంచి పింగిళి ధర్మారెడ్డి తో పోటి పడి ఓడిపోయారు.1978 ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం యెస్.సి రిజర్వ్ కావడం వలన ధర్మారెడ్డి, జంగారెడ్డి పరకాల పక్కనే ఉన్న జనరల్ సీటు శాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీకి తలపడ్డారు.
ఆ ఎన్నికల్లో జంగారెడ్డి గెలుపొందారు. 1983 లో మళ్ళి శాయంపేట నుంచి ధర్మారెడ్డి పై గెలుపొందారు. ఆ కాలంలోనె చాలా గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించడంతో ఆయన కరెంటు జంగన్న గా గుర్తింపు పొందారు.
1984 పార్లమెంటు ఎన్నికల్లో హనుమకొండ నుంచి పివి నర్సింహారావుపై దాదాపు 54వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించి దక్షిణ భారతదేశం బీజేపీ తొలి పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యి రికార్డు సృష్టించారు. 1984 లో దేశవ్యాప్తంగా బిజె.పి నుంచి ఇద్దరు ఎం.పి.లు గెలిస్తే అందులో ఒకరు జంగారెడ్డి కాగా, మరొకరు ఏ.కె పటేల్ గుజరాత్ లోని మెహ్సానా నియోజక వర్గం నుంచి గెలుపొందారు.
ఆ ఎన్నికల్లో వాజపాయ్ వంటి అగ్రనాయకులు సహితం ఓటమిపాలయ్యారు. పార్లమెంటులో జంగారెడ్డిని చూడగానే పి.వి. సాబ్ మీద గెలిచింది ఈయనే అని గుస గుసలు పెట్టుకునేవారట. వాజపేయి జంగారెడ్డిని తన సన్నిహితుడిగా చెప్పేవారు. అనంతరం 1989,1991,1996లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమాలుద్దీన్ అహ్మద్ చేతిలో జంగారెడ్డి ఓటమి చవిచూశారు.