డా. కె లక్ష్మణ్,
జాతీయ అధ్యక్షుడు, బిజెపి ఓబిసి సెల్
గడిచిన ఏడేండ్లలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతూ వస్తోంది. అభివృద్ధి విధానాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా ఈసారి కేంద్ర బడ్జెట్ రూపొందింది. రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలను బడ్జెట్ పొందుతోంది.
ఆత్మనిర్భర్ పునాదులతో నవభారత్ నిర్మాణానికి ఇది దోహదపడుతుంది. పేదలు, మధ్యతరగతి ప్రజలతో పాటు అన్ని వర్గాల వారికీ మౌలిక వసతులు కల్పించండంపై కేంద్రం ప్రధానంగా దృష్టి సారించింది. భారత్‌ను స్వయం సమృద్ధ, ఆధునిక దేశంగా తీర్చిదిద్దడం అత్యంత కీలకం. ఇందుకు ప్రస్తుత బడ్జెట్ దేశానికి మార్గదర్శిగా మారనుంది.
పేదలు, మధ్య తరగతి వర్గాలు, యువతపై ప్రత్యేకంగా దృష్టి పెడుతూ.. అన్ని ఈ వర్గాల ప్రజలకూ అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూపొందించారు. గతంలో మనదేశాన్ని ఇతర దేశాలు చాలా చిన్న చూపుతో చూసేవి. కానీ ఇప్పుడు మన దేశం పట్ల ప్రపంచ దృక్పథం చాలా మారింది.
బలమైన భారతదేశాన్ని చూడాలని ప్రపంచం కూడా కోరుకుంటోంది. ప్రపంచ దృక్పథం మారినందు వల్ల మన ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడం ద్వారా దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడం మనకు తప్పనిసరి. ఆ దిశగా ప్రస్తుత బడ్జెట్ రూపొందిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా
దేశాన్ని ఆధునికత దిశగా నడిపించే అనేక అంశాలు బడ్జెట్ లో ఉన్నాయి. పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఇది నాంది పలుకుతోంది. ప్రధాన మంత్రి గతి శక్తి మిషన్, సమ్మిళిత అభివృద్ధి, ఉత్పాదకత పెంపు, ఆర్థిక పెట్టుబడుల పెంపు ఈ నాలుగు సూత్రాలే మూల స్థంభాలుగా 2022–23 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి రూపొందించారు.
ఈసారి పీఎం గతిశక్తి, అభివృద్ధి, ఉత్పాదకత, అవకాశాలు, శక్తివనరులు, వాతావరణ మార్పులపై అధ్యయనం, పెట్టుబడులకు చేయూత లాంటి మొత్తం ఏడు రంగాలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఎకానమీలో సంస్కరణలతో జీడీపీ గ్రోత్ రేటు 9.27 శాతంగా అంచనాతో, పౌరుల ప్రయోజనాలే లక్ష్యంగా బడ్జెట్ రూపొందింది.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నాం. రాబోయే 25 ఏండ్ల అమృత కాలంలో ఆర్థికాభివృద్ధికి అవసరమైన పునాదిని వేసే బ్లూ ప్రింట్‌గా బడ్జెట్ ఉంటుంది. స్వయం సమృద్ద ఆర్థిక వ్యవస్థకు నిదర్శనంగా ఇది నిలుస్తుంది.
మోదీ దూరదృష్టితోనే
గత రెండేండ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయి, వ్యాపారాలు కుదేలైపోయాయి. ఆర్థికంగా కుటుంబాలు చితికిపోయాయి. అగ్రదేశాలు సైతం ఆర్థికంగా దెబ్బ తిన్నాయి. కొన్ని దేశాల్లో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలపై పన్నుల భారం మోపుతుందని భావించారు.
కానీ మోదీ ప్రభుత్వం కరోనాను ధీటుగా ఎదుర్కొంటూ.. రెండు దేశీయ సంస్థల ద్వారా ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ ను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి కరోనాను కట్టడి చేసింది. అంతేకాకుండా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరు మీద రూ.1,76,000 కోట్లతో దేశంలో ఏ పేదవాడు ఆకలితో అలమటించకూడదని 80 కోట్ల ప్రజలకు 5 కేజీల బియ్యం, పప్పులను ఉచితంగా పంపిణీ చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రత పథకాన్ని కొనసాగిస్తోంది.
ప్రధాని మోదీ దూరదృష్టితో పేదలను ఆదుకుంటూనే, ఆర్థికంగా దేశం నిలదొక్కుకుని స్వయం సమృద్ధి సాధించే దిశలో కేంద్రం అడుగులు వేస్తోంది.
రైతన్నల పట్ల ప్రత్యేక శ్రద్ధ
వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చింది మోడీ ప్రభుత్వం. వరి, గోధుమల మద్దతు ధర కోసం 2.37 లక్షల కోట్ల కేటాయింపు, సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వడం, రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచడం, అద్దె పద్ధతిలో రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించడం, ల్యాండ్ రికార్డుల ఆధునీకరణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించడం, నదుల అనుసంధానం కోసం పూర్తి స్థాయి సన్నద్ధతతో బడ్జెట్ ప్రవేశపెట్టడం రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు తార్కాణం.
రాష్ట్రాలకు వడ్డీ లేకుండా రుణ సౌకర్యం కోసం రూ. లక్ష కోట్లు కేటాయించడం, కేంద్ర ఉద్యోగులతో సమానంగా రాష్ట్రాల్లోని ఉద్యోగులకు ఎన్ పీఎస్ డిడక్షన్ చేయడానికి నిర్ణయించడం, రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం రూ.10.68 లక్షల కోట్లు కేటాయించడం సమాఖ్య వ్యవస్థ పై ప్రధాని మోదీకి ఉన్న గౌరవానికి నిదర్శనం.
ఏడేండ్ల క్రితం మన దేశ జీడీపీ రూ.లక్షా 10 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు అది రూ.2 లక్షల 30 వేల కోట్లకు పెరిగింది. దేశంలో విదేశీ మారక నిల్వలు 200 నుంచి 630 బిలియన్ డాలర్లకు పెరిగాయి. మోడీ ప్రభుత్వం సమర్థవంతమైన విధానాల వల్లే ఇది సాధ్యమైంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఆధునికత దిశగా నిరంతరం విస్తరిస్తోంది. ప్రభుత్వ చర్యల ఫలితంగా దేశ ఎగుమతులు రూ.4.7 లక్షల కోట్లుకు చేరాయి.
డిజిటల్ కు ప్రోత్సాహం
ప్రాంతీయ భాషల్లో 1 నుంచి 12 తరగతుల వరకూ అదనపు విద్యను అందించటానికి.. ‘ఒన్ క్లాస్-–ఒన్ టీవీ చానల్’ను ఏర్పాటు చేయడం.. ఎడ్యుకేషనల్ చానల్స్‌ను 12 నుంచి 200కు పెంచడానికి కేంద్రం నిర్ణయించింది. అలాగే దేశ వ్యాప్తంగా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంక్‌ల ఏర్పాటు, ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల అమ్మకం కోసం ప్రత్యేక పోర్టల్, అన్ని గ్రామాలకు భారత్ నెట్ ద్వారా ఆప్టికల్ పైబర్ ఇంటర్నెట్ అనేవి దేశాన్ని ఆధునీకరించడంలో కీలక అడుగుగా భావించవచ్చు.
ఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈ రంగాలకు రూ.6 లక్షల కోట్ల ప్రోత్సాహకాలతో కోట్లాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయనడంలో అతిశయోక్తి లేదు. మిషన్ శక్తి, వాత్సల్య, అంగద్, పోషన్ అభియాన్ 2.0 లాంటి పథకాలను కొత్తగా ప్రవేశపెట్టడం.. మహిళా, శిశు సాధికారత సాధన దిశలో కీలక ఘట్టం. 2 లక్షల అంగన్ వాడీలను సక్షమ్ అంగన్ వాడీలుగా అప్‌గ్రేడ్ చేసి పలు సదుపాయాలు కల్పించనున్నారు.
దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు లక్షా 50 వేల పోస్టాఫీసుల్లో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు, పేదలకు, వృద్ధులకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల అనేక ప్రయోజనాలు దక్కుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు దళారి వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారులకు చేరుతాయి. 2022–23 సంవత్సరానికి దేశవ్యాప్తంగా 3.8 కోట్ల మంది ఇండ్లకు మంచి నీరు అందించాలని కేంద్రం నిర్ణయించింది.
ఇది ట్యాక్స్ ఫ్రీ బడ్జెట్
కరోనా టైంలో పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తారని మేధావులు, ఆర్థికవేత్తలు ఆలోచిస్తున్న తరుణంలో ట్యాక్స్ ఫ్రీ బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషకరం. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు, డిజిటల్ ఇండియా సాధనతో ఆత్మనిర్భర్ భారత్ సాధనకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది.
పీఎం గతి శక్తి ద్వారా 25 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం నుంచి మొదలుకొని పీఎం ఆవాస్ యోజన ద్వారా పేదలకు 80 లక్షల ఇండ్ల నిర్మాణం కోసం రూ. 48 వేల కోట్లు కేటాయించడం వరకు దేశంలో సౌకర్యాల కల్పనకే బడ్జెట్లో పెద్ద పీట వేసినట్టుగా అర్థమవుతోంది. అధునాతన సౌకర్యాలతో 400ల వందే భారత్ రైళ్లను మూడేండ్లలో ప్రవేశపెట్టనున్నారు.
అలాగే వచ్చే మూడేండ్లలో 100 గతిశక్తి టెర్మినల్స్ అందుబాటులోకి రానున్నాయి. దేశంలో యువతకు 60 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోంది. ఐటీ రిటర్న్ దాఖలుకు బడ్జెట్ లో వెసులుబాటు లభించింది.
ఆదాయ పన్ను చెల్లింపుల్లో రిటర్నులు సమర్పించిన తర్వాత రెండేండ్లలో సవరణలు చేసుకోవచ్చు. పన్ను స్లాట్లలో మాత్రం మార్పు చేయలేదు. అదే విధంగా కోటి కుటుంబాలకు ఉజ్వల పథకం విస్తరించనున్నట్లు ప్రకటించారు. సహకార సంఘాలపై సర్‌చార్జీని తగ్గించారు.
తెలంగాణకు రూ.36 వేల కోట్లు..
తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో సుమారు రూ.36 వేల కోట్లు కేటాయించారు. ఇందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.56 కోట్లు, హైదరాబాద్ లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు రూ.374.35 కోట్లు, హైదరాబాద్ ఐఐటీకి రూ.300 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ.44 కోట్లు సమకూర్చారు. బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.10 వేల కోట్లు కేటాయించగా ఇందులో తెలంగాణకు రూ.3,048 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,030 కోట్లు అందనున్నాయి.
ఎన్నికల రాజకీయాలతో పని లేకుండా దేశహితమే లక్ష్యంగా దీర్ఘకాల లక్ష్యాలతో రూపొందించిన బడ్జెట్ ఇది. అన్ని రంగాలనూ సమాన దృష్టితో చూడటం కత్తి మీద సాములాంటిదే. అయినప్పటికీ అడ్డంకులను అధిగమిస్తూ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్‌ను రూపొందించడం, ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలపై భారం మోపకుండా పన్నుల రహిత బడ్జెట్ ను రూపొందించడం సాహసోపేతం.
(వి6 వెలుగు నుండి)