ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక కీలక సమావేశాలకే పరిమితమైన రాష్ట్ర బీజేపీ అగ్రనేత బీఎస్ యడియూరప్ప మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగి బీజేపీ గెలుపే లక్ష్యంగా ఆయన జిల్లాల్లో పర్యటించనున్నారు. మరో రెండు వారాల్లోనే జిల్లాల షెడ్యూల్ను ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయనకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవిని ఇవ్వజూపిన ఆయన సున్నితంగా తిరస్కరించారని, రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయడం పట్లనే దృష్టి కేంద్రీకరింపనున్నట్లు స్పష్టం చేశారని గతంలో వార్తా కధనాలు వెలువడ్డాయి.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే జిల్లాలవారీగా పర్యటిస్తానని, మరోసారి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని ఆయన ప్రకటించారు. అయితే కరోనా వైరస్ కేసులు రాష్ట్రంలో తీవ్రరూపం దాల్చడంతో వెనుకడుగు వేశా రు.
ప్రస్తుతం వైరస్ కేసులు రోజూ 10వేలకుపైగానే నమోదవుతున్నా తీవ్రమైన ప్రభావం లేకపోవడంతో సర్వత్రా సాధారణ పరిస్థితులు నెల కొంటున్నాయి. దీంతో యడియూరప్ప కూడా యాత్రకు సిద్ధమయ్యారు.
జిల్లాల్లో పర్యటించి నాయకులతో సమాలోచనలు జరిపి నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేయడం ప్రధాన ఆశయంగా పెట్టుకున్నారు.
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రజలకు సంక్షేమాలు అందించడంలో ఉత్సాహంగా ఉన్నారని, అందుకు అనుగుణంగానే ఎన్నో సౌలభ్యాలు పెరిగాయని యడియూరప్ప భావిస్తున్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2023 లో బీజేపీకి 130-140 స్థానాలు గెలిపించాలన్నదే తన ఆశయమని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యకర్తలను చైతన్యం చేస్తామని చెప్పారు.
కాగా జూలైలో యడియూరప్ప రాజీనామా తర్వాత వెంటనే యాత్రకు వెళితే సమష్టి నాయకత్వానికి విఘాతం కలగతుందని అధిష్ఠానం సున్నితంగా వాయిదా వేయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం సజావుగా సాగుతున్న తరుణంలో యడియూరప్ప యాత్రకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని పార్టీ వర్గాలు సహితం భావిస్తున్నాయి.
కొందరు ప్రస్తుత ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసినా ఆయన నాయకత్వంలోనే 2023 ఎన్నికలకు బిజెపి వెడుతుందని పార్టీ కేంద్ర నాయకత్వం స్పష్టం చేయడంతో ప్రస్తుతం పార్టీలో అంతర్గత సమస్యలు పెద్దగా కనబడటం లేదు.