అమెరికాలో మహాత్ముని విగ్రహానికి మరోసారి అవమానం జరిగింది. న్యూయార్క్‌లోని మన్హటన్కి సమీపంలోని యూనియన్ స్క్వేర్‌లో వున్న గాంధీ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని కొంతమంది దుండగులు శనివారం ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ చర్యను భారత కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి తుచ్ఛమైన చర్యకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాన్సులేట్ జనరల్ కోరారు. ఈ చర్య పట్ల భారతీయ అమెరికన్లు తీవ్ర బాధను, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విగ్రహంలో గాంధీ ముఖాన్ని గుర్తు పట్టడానికి వీల్లేకుండా ధ్వంసం చేశారనికాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా పేర్కొంది. వెంటనే ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
గాంధీ 117వ జయంతిని పురస్కరించుకుని 1986 అక్టోబరు 2న అంతర్జాతీయ గాంధీ మెమోరి యల్ ఫౌండేషన్ ఈ ఎనిమిది అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని డొనేట్ చేసింది. 2001లో ఇక్కడ నుండి ఈ విగ్రహాన్ని తొలగించి తిరిగి 2002లో గార్డెన్ ఏరియాలో పున:ప్రతిష్టించారు.
గత నెల్లో కూడా కాలిఫోర్నియాలోని ఒక పార్కులో గల ఆరడుగుల గాంధీ విగ్రహాన్ని ఇలాగే ధ్వంసం చేశారు.