ప్రముఖ గాయనీ లతా మంగేష్కర్ ఆలపించి ‘రామ్ భజన’ తన చారిత్రక రథయాత్రకు ‘సిగ్నేచర్ ట్యూన్’గా మారిందని బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ(94) అన్నారు. ఆమె మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన మాజీ ఉపప్రధాని ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఆమె అస్తమయంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని, అది తన అదృష్టమని వ్యాఖ్యానించారు. సోమ్‌నాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేపట్టాలని సంకల్పించినప్పుడు లత స్వయంగా రామ్ భజన ఆలపించి తనకు పంపారని అద్వానీ గుర్తుచేశారు.
ఆమె ఆలపించిన “రామ్ నామ్ మే జాదూ ఐసా… రామ్ నామ్ మన్ భాయే…మన్‌కీ అయోధ్య తబ్ తక్ సూనీ, జబ్ తక్ రామ్ నా ఆయే…” అంటూ సాగే ఆ చిరస్మరణీయ భజన తన రథయాత్రకు సిగ్నేచర్ ట్యూన్‌గా మారిందని తెలిపారు.
1990లె సాగిన రథయాత్ర బిజెపికి ప్రజల్లో విశేష ఆదరణను తెచ్చిపెట్టింది. అలాగే అయోధ్యలో రామమందిర నిర్మాణ డిమాండ్ కూడా ఆ యాత్రతోనే ఊపందుకుంది. తద్వారా బిజెపికి రాజకీయ లబ్ధిని కూడా చేకూర్చింది. ఆమె నిరాడంబరత, ప్రేమ తన హృదయాన్ని కదిలించాయని ఆయన తెలిపారు.
ఆమె హిందీ సినిమాకు అనేకానేక సుస్వర గీతాలు ఆలపించారని, ఆమె ఆలపించిన వేల సినిమా పాటల్లో ‘జ్యోతి కలశ్ ఛల్కే’ తనకు చాలా ఇష్టమైనదని ఆయన చెప్పారు. తన విజ్ఞప్తి మేరకు అనేక కార్యక్రమాల్లో లత ఈ పాటను పాడి వినిపించారని ఆయన గుర్తుచేసుకున్నారు.