రాష్ట్ర ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కనబరచకుండా ఆధిపత్య ధోరణితో వెళ్లిందని ఆయన ధ్వజమెత్తారు.
దీనివల్ల ఉద్యోగులకు ఊరట లభించలేదని స్పష్టం చేశారు. ఫిట్మెంట్, గత హెచ్ఆర్ఏ కొనసాగింపు, అశుతోష్ మిశ్రా నివేదిక ఇవ్వడం లాంటి ప్రధాన డిమాండ్లతో విజయవాడలో ఉద్యోగులు ఉవ్వేత్తున చేసిన భారీ ర్యాలీ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసిందని ఆయన గుర్తు చేశారు.
డిమాండ్లు నెరవేరకుండానే సమ్మె నిర్ణయం ఉపసంహరించుకొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన పరిస్థితిని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నాయకులకు ప్రభుత్వం కల్పించిందని ఆయన దుయ్యబట్టారు.
సమ్మె ఉపసంహరణ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు విభేదించిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్న అంశాలను జనసేన పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ వైఖరితో నష్టపోయిన ఉద్యోగ వర్గం పట్ల జనసేన సానుకూల దృక్పథాన్ని కనబరుస్తూ , వారి భావోద్వేగాలు విలువ ఇస్తుందని పవన్ తెలిపారు.
శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పవన్
కాగా, ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో జరుగుతున్న శ్రీరామానుజాచార్యులు సహస్రాబ్ది ఉత్సవాలకు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన సమతామూరి విగ్రహాన్ని సందర్శించారు.
విగ్రహం చుట్టూ నిర్మించిన 108 దివ్యక్షేత్రాలను దర్శించి పూజలు చేశారు. చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు కూడా అందుకున్నారు. తమ ఆశ్రమానికి వచ్చిన పవన్ కల్యాణ్ కు చిన్నజీయర్ స్వామి శాలువా కప్పి సత్కరించారు. ఆయనకు ఆశ్రమ విశేషాలను, సహస్రాబ్ది ఉత్సవ వివరాలను తెలిపారు.
అనంతరం పవన్ ప్రసంగిస్తూ.. సమానత్వంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. పవన్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా వచ్చారు. పవన్ రాకతో ఆశ్రమంలోనూ కోలాహలం నెలకొంది. ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.