ప్రతిష్టాకరమైన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు) తొలి మహిళా వైస్ చాన్సలర్‌గా తెలుగు మహిళా డా. శాంతిశ్రీ ధూలిపూడి పండిట్ నియమితులయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శాంతిశ్రీని జెఎన్‌యు వైస్‌చాన్సలర్‌గా నియమిస్తూ కేంద్ర విద్యా శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
59 సంవత్సరాల శాంతిశ్రీ పండిట్ జెఎన్‌యులో ఎంఫిల్‌తోపాటు అంతర్జాతీయ సంబంధాలలో పిహెచ్డి చేశారు. జెఎన్‌యు విసిగా శాంతిశ్రీ ధూలిపూడి పండిట్ నియామకాన్ని జెఎన్‌యు విజిటర్ అయిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించినట్లు విద్యా శాఖ ప్రకటించింది. శాంతి శ్రీ ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
1988లో గోవా విశ్వవిద్యాలయంలో తన అధ్యాపక జీవితాన్ని ప్రారంభించిన పండిట్ 1993లో పుణె విశ్వవిద్యాలయంలో చేరారు. యుజిసి సభ్యురాలిగా, ఇండియన్ కౌనిసల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసెర్చ్(ఐసిఎస్ఎస్ఆర్) సభ్యురాలిగా, కేంద్ర విశ్వవిద్యాలయాల విజిటర్స్ నామినీగా ఆమె ఉన్నారు.
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వీసీగా ఉన్న ఎం. జగదీశ్ కుమార్ పదవీకాలం గతేడాది డిసెంబర్‌తో ముగిసింది. కొత్త వీసీ నియామకం వరకు తాత్కాలిక వీసీ బాధ్యతల్ని ఆయనకు అప్పగించారు. తాజాగా జగదీశ్ కుమార్ యూజీసీ ఛైర్మన్ గా నియమితులవడంతో కేంద్రం శాంతి శ్రీని జేఎన్‌యూ వీసీగా నియమించింది. ఇద్దరూ తెలుగువారే కావడం గమనార్హం.
శాంతి శ్రీ పండిట్ తండ్రి ధూళిపూడి ఆంజనేయులు. డి.ఏ.గా సుపరిచితులైన ఆయన ప్రముఖ ఇంగ్లిష్ జర్నలిస్ట్, రచయిత. చాలా తెలుగు రచనల్ని ఇంగ్లీష్‌లోకి అనువదించారు. శాంతి శ్రీ తల్లి మూలమూది ఆదిలక్షి రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ యూనివర్శిటీలో తెలుగు, తమిళం ప్రొఫెసర్‌గా పనిచేశారు.. శాంతి శ్రీ 1962లో రష్యాలోనే పుట్టారు.
పుట్టిన 15 రోజులకే తల్లి చనిపోవడంతో రష్యా ప్రభుత్వం 16 నెలల పాటు పెంచి అనంతరం తండ్రికి అప్పగించింది. 18ఏళ్ల వయసులో ఆమె రష్యా సిటిజెన్షిప్ వదలుకున్నారు. శాంతి శ్రీ తండ్రికి దేశంలో అతిపెద్ద పర్సనల్ లైబ్రరీ ఉండేది. 1998 డిసెంబర్లో ఆయన చనిపోయాక ఆమె ఆ లైబ్రరీని పూనేకు మార్చారు.
ఆమెకు తెలుగు, తమిళం, మరాఠీ, హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్ మాట్లాడతారు. కన్నడ, మలయాళం, కొంకణి భాషలను అర్థం చేసుకోగలరు. చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత జేఎన్‌యూలో ఎంఫిల్, పీహెచ్డీ చేశారు. ఆ సమయంలో జేఎన్‌యూలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చదువుతున్నారు.
వివిధ విద్యాసంస్థల్లో అడ్మినిస్ట్రేటివ్ పదవిని ఆమె నిర్వహించారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) లలో సభ్యురాలిగా సేవలందించారు. ఆమె కెరీర్లో 29 మంది పీహెచ్‌డీలకు గైడ్‌గా వ్యవహరించారు.