దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన దౌత్యపర పాస్ పోర్టుల ద్వారా యూఏఈ నుంచి కేరళకు భారీ ఎత్తున బంగారం అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితురాలు అయిన స్వప్న సురేశ్‌కు తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు కొచ్చి కార్యాలయం ఎదుట హాజరుకావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సమన్లు జారీ చేసింది.
ఆమె వ్యక్తిగతంగా లేదా అధీకృత ప్రతినిధి ద్వారా హాజరు కావాలని పేర్కొన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దాదాపు 15 నెలలుగా జైలులో ఉన్న స్వప్న సురేశ్‌కు ఇటీవల కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. బంగారం స్మగ్లింగ్ కేసులో ఎన్ఐఏ యూఏపీఏ కింద కేసు నమోదు చేసింది.
కేరళకు చెందిన స్వప్న తండ్రి అబుదాబిలో స్థిరపడ్డారు. దీంతో అక్కడే జన్మించిన స్వప్న చిన్నప్పటి నుంచి విషయ పరిజ్ఞానం పెంచుకోవడంలో చురుకుగా ఉండేవారు. అబుదాబిలోనే చదువుకున్న స్వప్న.. అక్కడే విమానాశ్రయంలో ఉద్యోగం సంపాదించారు.
అక్కడ ప్రయాణికుల సేవా విభాగం గురించి క్లుప్తంగా తెలుసుకున్నారు. ఆ తర్వాత భారత్ కు వచ్చిన స్వప్న రెండేళ్లపాటు ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేశారు. ఆ తర్వాత 2013లో తిరునంతపురం ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ఇండియా సాట్స్‌లో ఉద్యోగం పొందారు.
అయితే అక్కడ ఒక అధికారిని తప్పుడు కేసులో ఇరికించడం కోసం నకిలీ పత్రాలు సమర్పించడంతో స్వప్నపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎయిర్ ఇండియా ఉద్యోగం మానేసిన తర్వాత ఆమె యూఏఈ కాన్సులేట్‌లో ఒక కీలక పదవిలో నియమితులయ్యారు. అక్కడే ఆమె పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, కేరళ దౌత్య వేత్తలతో పరిచయాలు పెంచుకున్నారు.
అరబిక్‌తో పాటు పలు భాషలపై పట్టున్న స్వప్నకు ఇది చాలా సులువుగా సాధ్యమైంది. అయితే స్వప్న అనేక అవకతవకలకు పాల్పడటంతో ఆమెను ఆ పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత స్వప్న కేరళ ఐటీ విభాగంలో ఉద్యోగం సంపాదించారు. అలా సీఎంఓలోని కొందరితో పరిచయాలు పెంచుకున్నారు. ఈ క్రమంలోనే తనకున్న పరిచయాలను అసరాగా చేసుకుని బంగారం అక్రమ తరలింపుకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.